పుట:Thimmarusumantri.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

93


తిమ్మరుసుమంత్రియు రాజ్యాంగసంస్కరణమునందు మాత్రము తనబుద్ధినంతయుఁ జొనిపి యూరకుండక దానుగూడ విద్యా వినోదకార్యములయందు భాగస్వామియై కాలము పుచ్చుచుండెను. తిమ్మరుసు శిక్షణముచేతనే రాజ్యాంగవిషయమున నెట్లో అట్లే విద్యావిషయమునఁగూడ కృష్ణదేవరాయఁడు ప్రఖ్యాతి గాంచ గలిగెను. ఈ రెండు సంవత్సరముల కాలములోనే అల్లసాని పెద్దనామాత్యుని కాంధ్రకవితాపితామహుఁడన్న బిరుదము లభించినది. ఇతనికి నందితిమ్మనామాత్యునకు నగ్రహారములను బెక్కింటిని ధారపోసెను. శ్రీకృష్ణదేవరాయఁడు మహాసామ్రాజ్యభోగముల ననుభవించుట మాత్రమే గాక సరస కవితావిలాసలాలసుఁడై తిమ్మనాది కవీంద్రుల పలుకుఁదేనియలఁ జూఱలఁగొని తానును సంస్కృతాంధ్రములందు సరస కవిత్వము చెప్పఁగల్గిన కవిరాజ శిఖామణియై కవీంద్రలోకమునఁ గడుఁ బ్రఖ్యాతిఁ గాంచెను. “మణివావలయం వలయేన మణి” అనునట్లు తిమ్మరుసు మూలమున కృష్ణరాయనికీర్తియు విద్యాధికప్రపంచమునకు విదిత మాయెను.

ఎట్టి ప్రఖ్యాతిని గాంచినకవి యేతెంచినను రాయనికంటె ముందుగాఁ దిమ్మరుసుచే నాతిథ్యమును బొంది సమస్తవిధముల సమ్మానింపఁబడుచుండెను. కనుకనే తిమ్మరుసునకు కవీంద్రపక్షపాతి యని పేరు వచ్చెను. ఒకప్పు డేకారణము చేతనో రాయని యాస్థానకవులు భట్టుమూర్తికవి నవమా