పుట:Tenugutota.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగుతోట

రుధిరకణ పూత మైన వీరుని కరంబు
ప్రణయ గంధ రంజిత మైన రసికు పాణి
స్మృతి హితాంజలు లిచ్చెడి సీమలందు
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

ద్రోహమున నల్లబడిన యస్థులభరంబు
ప్రేమచే ధౌత మయిన సాధ్వీనఖాళి
రత్నగర్భ దాచిన గుప్తరంగములను
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

తెగిన తంతుల మఱల బంధింప నేల
నిలిచియున్న యేకశ్రుతిని సవరించి
వేడుకయు వేదనయు రసవిదులు మురియ
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

గాఢ నిద్రోపవాస శుష్కమ్ము లయిన
కాళరాత్రుల దుఃఖసాగరము దాట
జుక్క లై సను నా త్రోవ జూపనపుడు
దాన మెవ డిచ్చె చుక్కాని లేని నావ
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

8