Jump to content

పుట:Tenugutota.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగు తోట

18

నిండుగృహ దీర్ఘికల నున్న నీరజముల
కడుపు చల్లనిపంట నా వెడలుచున్న
మదవదళికుల సంతాన ముదయగీతి
బాడుచున్నది కర్ణోత్సవముగ నిపుడు;

రవికిరణరాగ పులకిత రభస యయిన
లసదుషఃకన్య లజ్జావిలాస వశత
జాఱు రక్తాంబరము మడు పార విప్పి
కప్పికొన జూచెడిని నలంకారసరణి;

తెరలు ద్వారాల కింక బంధింప నేల ?
దరియ వచ్చెను శుభముహూర్తక్షణంబు,
పోయి రింతకె కొంద ఱుపాయమతులు
బింబసందర్శన కుతూహలంబు కలిమి,
పరవశాదరు లయిన యావయసు చెలులు
దరిసియుందు రీ సరికి యాత్రాస్థలంబు
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !

36