పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

ఆ వడ్లగింజల బాతిపెట్టింపదలంచి 'ఱేపే శుభదినము. ఱేపు బాతిపెట్టుదమా?' యనెను. సరేయని రామకృష్ణుడు పలికి, మఱునాటి సాయంకాలము రాయలు, ఆవడ్లు మొలిపించుటకు దున్నించిన స్థలము కడకు వెళ్ళెను. ఆవింత చూచుటకు బెక్కుమంది పౌరులు, కవులు నరిగిరి. రాయలు 'ఇక నవశిష్టమే'మని యడుగ రామకృష్ణుడు ‘మహాప్రభూ ! ఒక స్వల్పవిషయమును దమతోఁ జెప్పమఱచినాను, పెద్దగా నవ్వనివారే యీవడ్లగింజలను బాతిపెట్టుట కర్హులు' అనెను, 'ఎవరు గట్టిగా నవ్వనివారుందురు? అందరును యెప్పుడో యొకప్పుడు గట్టిగా నవ్వితీరుదురు' అని రాయలనగా రామకృష్ణుడు 'ప్రభువువారు గట్టిగ నవ్వినజాడ కానరారుగదా. తాము చల్లవచ్చును' అనెను. అబ్బే! నేను జూలసార్లు గట్టిగ నవ్వియుంటిని' అని రాయలునుడివెను.

'తమ సతియగు చిన్నా దేవిగారు నవ్వరేమో?'

'ఆమెకూడ నవ్వును. అందఱును నవ్వుదురు గట్టిగా నవ్వనట్టి వారీప్రపంచములో నెవ్వరుండరు. -

'ఆవిషయ మెరిగి తామెట్లు చిన్నాదేవిగారితో మాట్లాడుట యంతఃపురమునకు బోవుట మానినారు?' అని రామకృష్ణుడు ప్రశ్నించి నంతనే రాయలు సిగ్గుపడి కారణమ, లేకయే ప్రేమానురాగమూర్తి యగు నామెను బరిత్యజించి, మహాఘ మొనర్చితినని గ్రహించి 'రామకృష్ణకవీ! నాకు జక్కగా బుద్ధిచెప్పినావని పశ్చాత్తాపము నొంది చిన్నాదేవి నెప్పటియట్ల గౌరవింపసాగెను. రామకృష్ణకవి యొనరించిన మహోపకారమునకు గృతజ్ఞతాపూర్వకముగ జాల ధనమిచ్చి సత్కరించెను.