పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[7]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

49


తీర్చజాలక పోయితిగదా' యని రాయలు పరిమితిలేని విచారము నొందెను.

విషణ్ణవదనులైయున్న రాయలనుగాంచి, తాతాచార్యులవా రిట్లనిరి – 'ప్రభూ! మీరు గతించినదానికై వగచిన బ్రయోజన మేమియును లేదు. బంగారు మామిడిపండ్లను జేయించి, బ్రాహ్మణులకు దానమిచ్చినయెడల నామె కోరకయుదీఱును. మీ మనస్తాపముం దీరును' అనెను. ఆమాటలు నచ్చగా రాయలట్లేయని బంగారు మామిడిపండ్లనుజేయించెను. లెక్క లేనంతమంది భూసురులు గుంపులు గుంపులుగా రాసాగిరి. ప్రతిసంవత్సరమును గొన్నివేల దీనారము లిందుకు వ్యయమైపోవుచుండుటచే బెద్దనాది కవులు భీతచేతస్కులై రామకృష్ణకవిని హెచ్చరించిరి.

సరేయని రామకృష్ణుడు దేశదేశములనుండి దురాశాపరులై , వచ్చిన బ్రాహ్మణులున్న భవనముకడ కరిగి, 'బ్రాహ్మణోత్తములారా! మీకందఱకును మామిడిపండ్లనిచ్చుటకు ముందు రాయలవా రొక పద్దతిని దెలియజేయమనినారు. ఒక్కొక్కపండు కావలసినవారు ఒక్కొక్కవాత పొందవలయును. రెండుపండ్లు కావలసినవారు రెండువాతలను బొందవలయు' నని పలుక, నా బ్రాహ్మణులు విశ్వసించి, ఒక్కొక్కవాతను బొందిరి. కొంతమంది రెండేసి వాతలను మెందిరి. తరువాత రాయలువచ్చి బ్రాహ్మణులందఱకును మామిడి పండ్లీయఁబోయెను. రెండువాతలు పొందిన ద్విజుఁ డొకఁడు 'అయ్యా! నేను రెండ వాతలు వేయించుకొన్నాను. నాకు రెండు పండ్లీయవలెను' అనెను.

'వాత లేమిటి' అని రాయలు నాశ్చర్యముగాఁ బలుక నా బాహ్మణులందఱును దమవాతలఁ చూపించిరి. రాయలు ముక్కుపై వ్రేలిడుకొని నిర్విణ్ణుడయ్యెను. రామకృష్ణునకు వెంటనే కబురంపి, “నీకు మతిపోయినదా? నేను సంతోషముగా సువర్ణచూతఫలము