పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

45

“ఓహో! ఎంతయందముగా నున్నది. తమరు వ్యాకరణము నింతయందముగా వెలిగించినవారని తలుపలేదు.”

ఆనాటికి గొలువు చాలింపబడెను. మఱునాడు మఱలవాదము ప్రారంభమయ్యెను. రామకృష్ణకవి యొక పెద్దకట్టపై నొకవస్త్రము గప్పియుంచెను.

'ఆ గ్రంథమేదియో యెఱుంగవచ్చునా!' అని రామశాస్త్రి యడుగ, రామకృష్నుడు 'ఇదితిలకాష్ఠమహిషబంధనమను గ్రంథము, మనవాదమునకు బనికివచ్చునని యీగ్రంథమును గొనివచ్చినా' ననెను.

రామశాస్త్రి 'తిలకాష్ఠ మహిషబంధనమను గ్రంధమున్నదని యెన్నడును వినియుండలేదు.' అందుచే నాతడు కంగారుపడి తనకా నాడు ఓటమి తప్పదని గ్రహించి, 'మహారాజా! బసలో నావ్యాకరణ గ్రంధముల మఱచిపోతిని, త్వరితముగా గొనివత్తును. సెలవిండు' అని వెడలిపోయి, యా నగరమునుండి వెడలిపోయెను—

రాయలు 'రామకృష్ణకవీ! ఆ రామశాస్త్రి వచ్చులోపున నా తిలకాష్ఠ మహిషబంధనమను గ్రంథమును జదువుము' అనెను.

రామకృష్నుడు నవ్వుచు 'మహాప్రభూ! తిలకాష్ఠ మహిషబంధనమనగా నేదో గ్రంథమనుకొంటిరిగాబోలును' అనివస్త్రమును దొలగించెను–నువ్వులకంప, కన్నెత్రాడు నుండెను. 'మహారాజా! తిలకాష్ఠ మనగా నువ్వులకంప, మహిషబంధన మనగా యెద్దును గట్టు కన్నెత్రాడు' అనెను.

'నిజముగా నా పేరువిని యాశాస్త్రి కంగారుపడి పాఱిపోయినాడు' అని పెద్దనకవి పలుకగా నందఱును నవ్విరి.