పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


యందముగా నున్నది. అందుచే నిది రక్తికట్టుటకై కృష్ణపాత్రధారిని గొట్టినా నని బదులుపలికెను. రాయలు కుపితుడై పహరా నిచ్చుచున్న భటుల బిలిపించి 'రామకృష్ణుని యిరువదినాలుగు దెబ్బలు కొట్టుడని యాజ్ఞాపించెను రామకృష్ణునిఁ దీసికొని పోవుట కాభటులు ముందుకురాగా మహారాజా! మీరు శిక్షవిధించుట న్యాయమేగాని నేను లోనికి నచ్చినపు డీ యిరువురు భటులతోడను, నాకు రాయలవారు ప్రసాదించు బహుమానము చెరిసగము మీకిచ్చెదనంటిని. అందుచేత నాయిరువది నాల్గు దెబ్బలలో వీరికి పండ్రెండు వారికి పండ్రాడు దెబ్బలు తగులవలయు ననెను. ఆభటులు మొర్రోయని ఏడ్వసాగిరి. రామకృష్ణుని యుక్తికిముదమంది రాయలు మన్నించెను.


25 తిమ్మరుసు

ఉత్తరదేశ దండయాత్ర పూర్తిచేసికొని వచ్చుచు, రాయలు సింహాచలక్షేత్రమును సందర్శన మొనరించెను. సింహాద్రిస్వామి సన్నిధిని రాయలనేక దానములగావించెను. పెద్దనాది కవులందరు గూడ రాయల ననుసరించియుండిరి. తిమ్మరుసు మంత్రికూడ పెక్కు దానముల జేసెను. రాయ లగ్రహారదానము చేయనెంచితినని చెప్పగా రామకృష్ణుడు తన బంధువుఁడగు మంత్రిప్రగడ బుచ్చి వేంకయ కాదానమిప్పించవలసినదని రాయలను కోరెను. రాయ లందులకు సమ్మతింప, తిమ్మరుసు, రామకృష్ణుడు తక్కుంగల కవులవలె దనయెడ భయభక్తియుకుడై మెలంగడను కోపముతో వలదని వారించెను. రామకృష్ణుడు క్రోధమునంది యీపద్యము జదివెను-

ఉ. లొట్టయిదేటిమాట పెనులోభులతో మొగమాటమేల తా
     గుట్టకయున్న వృశ్చికము కుమ్మరపువ్వని యందు రేకదా
     పట్టపురాజుపట్టి సరిపల్లె సరాసరి యీయకున్న నే
     దిట్టకమాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ.