పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

తెనాలి రామకృష్ణకవి చరిత్రము



'క . సుబల తనయ గుణమహిమన్
     బ్రబలి తసకుధారధర్మ పాలనలీలన్
     సొబగొంది వన్నె దేఁగా
     విబుధ స్తుతుఁడవ్విభుండు వెలసెన్ ధరణిన్ .

తన్నారీతి నాక్షేపణం బొనర్చినందున గ్రోధంబునుజెంది, పింగళి సూరన్న యింటికిజనెను. భార్యభోజనమునకు లెమ్మని బ్రతిమాలినను లేవక పింగళి సూరన్న రామకృష్ణుపై గోపముకొలదినొక పద్యము నిట్లు వ్రాయఁబూ నెను—

క. 'తెనాలి రామకృష్ణుఁడు
    తిన్నాడుర తట్టడంత--

ఇకమీద నాతనికేమియు స్ఫురింపనందున భోజనము చేసి పిదప వ్రాయదలంచి, స్నానార్ధము తుంగభద్రకరిగెను. తనపై గోపగించి వెళ్ళినందున ముక్కో పియగు సూరన్న భోజనము చేసినాడో లేదోయని రామకృష్ణుడు సూరన్న గృహమున కరిగి చావడిలో నున్న తాటియాకుం దిలకించి, తనపైవ్రాసిన యర్థభాగము జదువుకొని, మిగిలిన రెండుపాదములను బూర్తిచేసి వెడలిపోయి, పెద్దనాదికవుల గొనివచ్చెను, ఆసమయమునకు సూరన్న భోజనము చేయుచుండుటచే పెద్దన తాళపత్రముం దిలకించి యందఱు నాలకించునట్లు చదివెను.

'క. తెనాలి రామకృష్ణుఁడు
    తిన్నాడుర తట్టెడంత తియ్యనిబెల్లం
    బెన్నఁగ మన పింగళ సూ
    రన్నకు నోరంత పేడయై పోయెనురా'

అందఱును నవ్విరి. పెద్దన “సూరన్న ముక్కోపి యగుట నిటు వ్రాసినాఁడు అనెను. సూరన్న రామకృష్ణుఁడు వ్రాసిన మిగతపాదములకు గినియక నవ్వి యూరకుండెను.