పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

27

ఉ. ఆర్ణవవేష్టితాఖిల మహామహి మండలమందు బూతుని
     బూర్ణుఁడు రామకృష్ణకవిఁబోలు కవీశ్వరుఁ డొండుగల్గునే
     నిర్ణయమెంచిచేయు మహనీయగుణాడ్యుడు బూతుమంచిగా
     దుర్ణయుఁడైనచో దివిరిధూర్తతమంచిని బూతుచేసెడున్ ,

15 పెద్దన కవిత్వము నాక్షేపించుట.

విద్వత్కవు లెల్లరును గూర్చుండి యుండగా రామకృష్ణుఁడు నిలువబడి రాయలు నుద్దేశించి, 'మహారాజా! నాతో భక్తిరసాత్మకములగు బద్యముల నాశువుగా నెవరును చెప్పలేరని ఘంటాపదముగా జెప్పగల' ననెను — రాయలు రామకృష్ణకవీ! భక్తిరసోజ్వలములగు పద్యములఁ జెప్పుము. అప్పుడు నీకంటె యుత్తమముగ నెవరైన నట్టి కవిత్వము జెప్పగలవారుందురో, ఉండరో నిర్ధారణ చేయవచ్చును. రామకృష్ణుఁ డిట్లు చదివెను—

“ఆ. వె. లచ్చిమగఁడ నీకు లక్షనమస్కృతుల్
          సీతమగఁడ! నీకు సేవఁజేతు
          సత్యభామమగఁడ సన్నుతించెద నిన్ను
          మిత్రవిందమగఁడ మేలొంగు
          లక్షణకు మగండ లాలింపరా నన్ను
          నీలమగఁడ నాకు నీవె దిక్కు
          జాంబవతికి మగఁడ జాలంబుసేయక
          యెల్లిమగఁడ నన్ను నేలికొనర!”

రాయలు “ఓహో! మిక్కిలి భక్తిరసాంచితమై యన్నది" యని నాక్షేపణపూర్వకముగాననఁగా రామకృష్ణుఁడు “మహారాజా! తాము నన్ను హేళనఁ జేయనక్కఱలేదు, లోకములో బురుషునకు