పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

21


ధూర్జటి, రామరాజభూషణుడు మున్నగు కవులందఱికంటె మిన్నగ నాశుకవిత్వముం జెప్పుదును వారిపద్యములందుఁ దప్పులుపట్ట చూపింతును, ఎట్టిపద్యమైనను, నెంతకఠినముగానున్నను దప్పులేకుండవ్రాసి చూపింతును, అని చెప్పెనట రాయలు సరేయని సమ్మతించెను. పెద్దనాదికవు లొకరిమొగమువంక నొకరు చూచుకొనుచుండ, రామకృష్ణకవిలేచి, 'అయ్యా! నరసరాజకవీ! గొప్పవ్రాతకాఁడనని చెప్పుచున్నావు? నేను చెప్పు పద్యమును వ్రాసెదవా? అని యడిగెను.

'ఓహో! నిస్సంశయముగా వ్రాయుగును.'

రామకృష్ణుఁ డంతట నీక్రింది పద్యమును జదివెను.

“క, తృవ్వట బాబాతలపై
     బువ్వట జాబిల్లి నల్వబూచట! చేదె
     బువ్వట చూడగను హళు
     క్కవ్వట తలఁపంగ నిట్టి హరునకు జే జే ”

చితోచ్చారణముగల యాపద్యమును నరసరాజువ్రాయజాలక పోయెను. “సరే! వ్రాతలోని నీపసతేలిందింక మఱొక్క పద్యము జెప్పెద నర్థము చెప్పు” మని రామకృష్ణుడీపద్య ము జదివెను.

మ. కన నీహారగు పద్మపత్రధళరంగతీకార్తి! చాణూరమ
      ద్దనశుక్రాక్షికళేభరాణ్మృగపతీ! త్త్రెలోక్యదామోదరా
      యనగా శంకరవాంఛితార్థకృపదివ్యాస్తోకం పాణీజనా
      ర్థన వాహిప్రద! వైరివిగ్రహముకుందా! మిత్రవింధాధిపా!"

నరసరాజు “రామ రామ! ఇటువంటి యపశబ్దములను వినిన పాతకము వేయిజన్మములకైన తొలగదు” అనగా రామకృష్ణకవి “ఓహో! ఈ మారు నీపాండిత్యమంతయు వెల్లడియైనది, సుశబ్దములు నీకపశబ్ధములయ్యె నా? సరే నేనర్ధము చెప్పెద నాకర్ణింపుము.