పుట:Telugunaduanuand00srirsher.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగనునాఁటివారల నుతింప నతిశ్రమ మంచు నెంచకే
తెలుఁగున వీథి సేయఁదగదే ధని మెచ్చిన మెచ్చుగల్గునే.

కం.కులవర్తనముల నానా
కలనము లాచారముల ప్రకారము లందం
బులఁ జందంబుల నుడుఁగుల
పలుతెఱఁగులు నిందుఁ జెప్పఁబడుఁ గడువేడ్కన్‌.

చ. ఇది నవవీథి దీనికి ననేకరసంబు లనేకనాయకుల్‌
పదపడి మంచిచెడ్డలును బాగులునోగులు మేళ్ళుఁగీళ్ళునుం
గొదవలుగొప్ప లాంధ్రజనకోటికి నెట్లగు నట్లు సెప్పెదన్‌
మదిఁబరికించి కోపమును మానుఁడు నానుడుఁ గానుఁడూరకన్‌.

ఉ.ఉన్నది యున్నయట్లు మధురోక్తులఁ జెప్పిన కబ్బ మెప్పుడున్‌
బన్నమునొంద దందఱును బాగని మెత్తురు, లేనిపోని దం
ధన్నలు కొన్ని పన్నుక కతల్‌ వెదఁబెట్టిన నేమి, యన్నెమా?
పున్నెమ? పూరుషార్థమ? బుభుక్షువు సేసిన బ్రాహ్మణార్థమా?

సీ.భాషీయపద్ధతి పట్టుదప్పఁగనీక
          దీర్ఘ సమాసంబు తెరువుపోక
గూఢార్థసమితి దిక్కున దేఱిచూడక
          స్పష్టార్థములజాడ జాఱనీక
మఱుఁగు పదంబుల మార్గంబు ద్రొక్కక
          తేటమాటల రాచబాట విడక
దూరాన్వయంబుల దారి మూచూడక
          సంకరాలంకార సరణి గనక

గీ. ఉన్నయది ఉన్నయట్టులు గన్నయదియు
గన్నయట్టులు విన్నది విన్నయటులు
నన్నయది యన్నయట్టులు వన్నె వెట్టి
కవితఁ జెప్పిన సంతోష మవు జగాన.

సీ. ఉచ్చరించినమాట యూఁకొన్న మాత్రనే
           యెట్టిదో తాత్పర్య మెఱుఁగవలయు
నెఱిఁగి డెందానఁ జింతించిన మాత్రనే
          దృష్టాంత మొకటి స్ఫురించ వలయు
స్ఫురియించి సరిఁజూచి పరికించు మాత్రనే
          దొసఁ గిందు లేదని తోఁచవలయు
తోఁచి యొక్కింత యాలోచించు మాత్రనె
         "యౌరా! యథార్థమే" యనఁగవలయు

గీ. స్వస్తుతియుఁ బక్షపాతము సంప్రదాయ
భంగమును, మత్సరము, శాస్త్రబాధ, నీతి
లోపమును, నింద, కఠినోక్తి దోఁపరాదు
కవి జగచ్ఛ్లాఘనీయమౌ కవిత గూర్ప.

ఉ. ఓరుపులేని వాఁడను మహోద్యమ మిచ్చి సుధీముఖంబునం
దీరుపులేనివాఁడను, విధిచ్యుతి లేని కృతిన్‌ రచింపఁగా
నేరుపులేనివాఁడను, గుణిప్రకరం బెపుడైన నిందు నా
కూరుపుఁ జూచి చీ! యనునొకో? తలపెట్టితి నేమి సేయుదున్‌.

ఉ. లోకములోని యెల్లనరలోకముల న్నిఖిలప్రవృత్తులం
దేకముగా సృజించెను మహేశుఁ డటంచుఁ తలంచి యెవ్వఁడా