పుట:Telugu bala Satakam PDF File.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. అలరు చుండ వలయు నన్నదమ్ములవోలె
శిష్యులెల్ల మిగుల శ్రేష్టులగుచు
కులమతాల గోడ కూల్చుట యుక్తమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

8. ఒళ్లు వంచి పనుల నుత్సాహముగ చేయ
ఫలితమదియె కలుగు బాగుగాను
కష్ట పడెడు గుణము ఘన కీర్తి కలిగించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

9. చిన్నవయసునందె చిత్తాలు రంజించు
పద్య తతులు నేర్చి పలుక వలయు
పద్య ధారణమ్ము ప్రతిభను పెంచును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

10. ఆటపాటతోడ హాయిగా చదువంగ
చదువు తలల కెక్కు ఛాత్రులకును
ఆటపాట లెపు డు ఆరోగ్య మందించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

11. యాత్రవలన జ్ఞానమభివృద్ధి యగునంచు
పలుకునట్టి తీరు ప్రబలమయ్యె
దేశవున చూడు కోశమైనను చూడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

12. బట్టి పట్టరాదు పాఠ్యాంశములనెల్ల
తెలిసి చదువ మేలు కలుగుచుండు
బట్టి గొట్టువాడు ఒట్టి బడుద్ధాయి
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


                                                     తెలుగు బాల శతకం