85. తాను తక్కువనెడి న్యూనతా భావమ్ము
వదలు చుండవలయు బాగుపడగ
అన్ని గూర్చుచుండు ఆత్మవిస్వాసమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
86. చెప్పునట్టి మాట చేదుగానున్నను
నిజము చెప్పవలయు నియతరీతి
మాత్ర చేదుదైన మాన్పురోగమ్మును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
87. శాస్త్ర విద్యలోన సన్నుతి కక్కినన్
మానవతయ ముఖ్య మవని మిాద
కరుణలేని విద్య గణుతికెక్కదెపు డు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
88. నీరు కలుషితమ్ము నింగి కలుషితమ్ము
గాలి చూడ మిగుల కలుషితమ్ము
మనిషి మనసు చూడ మరి యెంతొ కలుషితమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
89. ధనము లేని వారు ఘనమైన కోర్కెలన్
చదువు నభ్య సింప సాగదిపుడు
విద్య సాగకుండె విత్తమ్ములేకున్న
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
90. చిత్త మిష్ట పడగ శీతల పానీయ
స్వీకరణము మిగుల చేటు కూర్చు
కోరి తాగవలయు 'కొబ్బరిబోండమున్'
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
తెలుగు బాల శతకం 21