పుట:Telugu bala Satakam PDF File.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. తిండితినెడియపుడు మొండిగా నుండుట
బాలవర్గమునకు భావ్యమగునె?
తిండి కలిగినపుడె కండకలుగుగదా!
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

14. అక్క, బావ, మామ అన్నయను పిలుపు
         ప్రేమ రసము నింపు పెల్లుగాను
      తల్లిబాసమనల తనియింపచేయును
       తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

15. తెలుగు భాషలోన తేనలు ప్రవహించు
తీపిరుచుల భాష తెలుగు భాష
తెలుగు మాట వలన తేజమ్ము పెరుగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

16. పాఠ్య బోధా చేయు పంతులయ్యల చూచి
పిచ్చి పేర్లతోడ పిలువరాదు
గురుల గౌరవించు గొప్పజాతి మనది
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

17. చెట్టు నీడ నిచ్చి సేదాదీర్చుచునుండు
ఫలము లిచ్చిచెట్టు బలము పెంచు
చెట్లు పెంచినపుడు చిక్కులు దీరురా
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

18. అమ్మ అనెడి పిలుపు అమృతము వలెనుండు
నాన్న యనెడి పిలుపు వెన్న సమము
అమ్మ నాన్నపిలుపు లాప్యాయతల్‌ పెంచు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగుబాల శాతకం---9