పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టి యీ సంఘమువారు కోరుచున్నారు. ఈసమావేశమునకు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు, ఇంగ్లండు దేశముల ప్రతినిధులు హాజరయిరి. ఇది లండను నగరమున జరుగుచున్నది. వాలంటీర్లను రప్పించుటకు ఇటలీ ప్రభుత్వమువారు మొదట కొంచెము సంధిగ్ధావస్థను కలిగించిరికాని చివరకు అంగీకరించినట్లే వార్తలవలన తెలియుచున్నది.

                 తొమ్మిదిరాజ్యముల సమావేశము:-
    ప్రపంచ శాంతినిగురించి ఆలోచించి అవసరమగు విధమున తీర్మానించుటకు తొమ్మిదిరాజ్యముల సమావేశమును ఇంగ్లండు, ఫ్రాన్సుప్రభుత్వములవారు యేర్పాటుచేయుచున్నారు.  ఈసమావేశమునకు హాజరుకావలయునని ఇటలీ, జర్మనీ, ప్రభుత్వములవారికి గూడ ఆహ్వానములు పంపబడినవి.  ఈసమావేశము బెల్జియం దేశ రాజధానియగు బ్రస్సెల్సునగరమున జరుగును. ఇందుకు అవసరమగు యేర్పాట్లన్నియు బెల్జియం ప్రభుత్వమువారే చేయుదురు. ఈ సమావేశమున ప్రప్రధమమున చైనా-జపాను యుద్ధమును గూర్చి చర్చలుజరుగును.  ఈసమావేశమునకు ఇటలీ, జర్మనీ, అమెరికదేశముల ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లెదరు.  జపానువారు తమప్రతినిధి పంపుదురని నమ్ముటకు వీలులేదు.  చైనాప్రభుత్వ ప్రతినిధి మాత్రము తప్పక హాజరగును.
                     పాలస్టయిను:-
   పాలస్టయినునందు అల్లరులు యింకను జరుగుచునేయున్నవి.  ఆరబ్బు నాయకులను ఎంతో మందిని ప్రభుత్వమువారు జైలునందుంచినారు. జెరూసలేమునగరమునందంటను పోలీసు రిజర్వుదళములు కాపలాగాయు చున్నారు. అరబ్బుమతనాయకులకు 'గ్రాండ్ ముస్తి ' జెరుసలేమునుండి తప్పించుకొని పారిపోయెను. లిబయాలోని అరబ్బులు కూడ, పాలస్టయిను ఆరబ్బులతో సహకారముచూపెదమని ముసోలినికి టెలిగ్రాము పంపినారు.  ఇటీవలవార్తలనుబట్టి పాలస్టయునునందు కొంతవరకు అలజడితగ్గినదని తెలియుచున్నది.  కాని, మిలిటరీదళములవారు మాత్రము, అరబ్బుల యిండ్లను తగులబెట్టి వారిని నానాహింసల పాలుచేయుచున్నారు.  జెరుసలేమునందు కాపురమున్న అబిస్సీనియా దేశీయులందరును లండను నకు వెళ్లిపోవుచున్నారు.