పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీ|| పూ|| 484 సం||రమున నొకానొక ప్రియశిష్యుని యాహ్వానము వలన తిరిగి జన్మదేశమునకు వచ్చెను. అచ్చట 478 సం|| వరకుండి మరణించెను. ఆయన జీవితమును వీడునప్పటికి వయసు 72 వత్సరములు. శేషవయసున మిక్కిలి శోకసంతప్తుడాయెను. ఆయన ప్రియపుత్రుడు గచించెను. తదనంతరము ప్రియశిష్యుడు మరణించెను. మృత్యువునకు పూర్వము, కన్ఫూషియాన్ యొకపురాతన గ్రంధమును సంపాదించి దానిని ప్రచురించెను. ఆయన స్వతంత్రముగ నొక గ్రంధమును రచించెను. ఆయన యుపదేశములను శిష్యులు గ్రంధరూపనుమున బ్రచురించిరి. ఆ గ్రంధమునకు ఇంగ్లీషు అనువాదము కలదు. కన్ఫూషియాని శిష్యులు ఆయన యుపదేశ ములను ఆయన మరణీంచిన రెండు మూడువందల వత్సరముల తర్వాత ప్రచురించిరని నుడువుదురు. జ్ఞానగంభీరతయందు కన్ఫూషియస్ గ్రీసు దేశమునకు పవిత్రవంతముగ నొనర్చిన ప్లేటోతోడను, భారత వర్షమందలి మనువు, కౌటిల్యులతోడను పోల్చదగును. ఆయన యుపదేశములు సమస్త మానవుల కాదర్శప్రాయములు. ఒకచోట నీ క్రిందివిధమున నుడివెను.

"15 వర్షముల ప్రాయమందు సుశిక్షణ బొందవలయునను ప్రబలేచ్చ యుండును. ముప్పది వత్సరముల వయసున తనంతటతాను నిలువ గలుగును- 40 వత్సరముల ప్రాయమున మనస్సు సందేహమువిముక్తమగు 50 వర్షమందు స్వర్గీయ నియమముల పాలింపుచు, భగత్స్వరూప మవగత మగును. 60 వర్షములప్పుడు మన కర్ణములు మనం ననుసరింపుచుండును. 70 సం|| ప్రాయమున వివేకానుసారము కర్మయొనర్చుచుందుము. అంతర్బహెర్విషయములయందు సత్యమునుండి విచలితులము గాకుందుము."

"జీవితకాలమంతయు తలిదండ్రుల సేవయందుండుటయే, పుత్రుల కర్తవ్యము మృతులైన తలిదండ్రుల కొరకు పుత్రుడు శోకసంతప్త హృదయమున అంత్యక్రియల నాచరించి బ్రతికియున్నంతకాలము వారిని ఉపాసింపు చుండ వలయును.

"సజ్జనుడగువాడు స్వీయవాక్యములను కార్యరూపమున బరిణమింప జేయును. తదనంతరం దానిని వాక్యముల ద్వారమున సిద్ధాంతీకరించును"

"చింతాశీలతలేని వ్యక్తియధ్యయనము వ్యర్ధము. అధ్యయన వ్యతీతమగు చింతాశీలత మిక్కిలి విసజ్జనకము."