పుట:Telugu Right to Information Act.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఛాప్టర్ III

కేంద్ర సమాచార కమిషన్

(12) (1) ఈ చట్టం కింద సంక్రమించిన అధికారులను వినియోగించేందుకు, అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు అధికార గెజిట్లోనోటిఫికేషన్ ద్వారా కేంద్ర సమాచార కమిషన్ అనే సంస్థను ప్రభుత్వం స్థాపిస్తుంది.

(2) కమిషన్ లో కిందివారు ఉంటారు.
(ఎ) ప్రధాన సమాచార కమిషనర్
(బి) పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో కేంద్ర సమాచార కమిషనర్లు
(3) ప్రధాన సమాచార కమిషనర్ ను, కేంద్ర సమాచార కమిషనర్లను ఒక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఆకమిటీలో కిందివారు ఉంటారు.
(ఏ) ప్రధానమంత్రి, కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.
(బి) లోక్ సభలో ప్రతిపక్షనేత
(సి) ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర క్యాబినేట్ మంత్రి.

(వివరణ : లోక్ సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతిపెద్ద పార్టీ నాయకుణ్ని ప్రతిపక్ష నేతగాపరిగణిస్తారు.)

(4) కేంద్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణ, దిశానిర్దేశం, నిర్వహణ అధికారాలు ప్రధాన సమాచార కమిషనర్ కుసంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్ కు కేంద్ర సమాచార కమిషనర్లు సాయపడతారు. ఈ చట్టంకింద స్వతంత్ర ప్రతిపత్తిలో మరే అధికారానికి లోబడకుండా కేంద్ర సమాచార కమిషన్ వినియోగించే అన్ని అధికారాలనూ, నిర్వహించేఅన్ని పనులనూ కేంద్ర సమాచార కమిషనర్ వినియోగించవచ్చు. నిర్వహించవచ్చు.


(5) ప్రధాన కమిషనర్, సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. వారికి విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతికరంగాలు, సామాజిక సేవ, మేనేజ్ మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవం ఉండాలి.


(6) ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషనర్ పార్లమెంట్ సభ్యులు గానీ రాష్ట్రాలు లేక కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులుగానీ అయి ఉండరాదు. ఆర్థికంగా లాభం చేకూరే ఏ ఇతర పదవిలోనూ ఉండరాదు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండకూడదు. ఏ ఇతర వ్యాపారాన్ని గానీ, వృత్తిని గాని నిర్వహించరాదు.


(7) కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత కేంద్రసమాచార కమిషన్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు.


13. (1) ప్రధాన సమాచార కమిషనర్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అయిదేళ్లపాటు పదవిలో ఉంటారు. ప్రధాన సమాచారకమిషనర్ పునర్నియామకానికి అవకాశం లేదు. 65 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఏ సమాచార కమిషనర్ కూడా పదవిలోఉండేందుకు వీలులేదు.