పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్ణించారు. కాల క్రమేణా స్త్రీ పాత్రలు ధరించి అఖండమైన పేరు ప్రతిష్టలు తీసుకున్నారు. ఆనాటి యక్షగానాలలో నాగ, అనే స్త్రీ స్త్రీపాత్రలు ధరించి అఖండమైన పేరు ప్రతిష్టలు సంపాదించింది.

పెండెలనాగి:

అగ్రవర్ణపు స్త్రీ గాక తక్కువ జాతి స్త్రీ కావడం వల్ల నాగి అనే పేరు వచ్చింది. పెండెల నాగీ ప్రదర్శించిన పాత్రలలో ముఖ్యమైనది క్రీడాభిరామంలోని స్త్రీ పాత్ర. క్రీడాభిరామం ఆనాటి వీథినాటకాల్లో ముఖ్యమైంది.

ఆ రోజుల్లో పిచ్చుకుంటులవారు శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్రను, కాటమరాజు కథను గొల్లవారు, యల్లమ్మ కథను బవనివాండ్రు చెపుతూ ఉండేవారు. ఇలా ఆయా కులాలకు చెందిన వారు వారి వారికి ప్రియమైన కథల్ని చెప్పుతుంటూ వుండేవారు.

పైన వుదాహరించిన యల్లమ్మ కథనే బవని వారు రేణుక కథగా చెప్పేవారు. దీనిని విపులంగా, ఇకే కథను రెండు రాత్రుళ్ళపాటు జవనిక (ఈనాటి జముకు) వాయిస్తూ చెపుతూ వుండేవారు. వేరే పెద్ద దేవర కథను రాయలసీమ జిల్లాలలో చెపుతూ వుండేవారు.

కర్ణానందమైన కామేశ్వరి కథ:

ఆ రోజులలో అగ్రవర్ణులైన బ్రాహ్మణుల ఇండ్లలో కామేశ్వరి కథను ఎంతో ప్రసిద్ధంగా చెప్పుకుంటూ వుండే వాళ్ళు. కథను ఉదయం ప్రారంబించి సాయంత్రం వరకు చెపుతూ వుండేవారట. ఇరుగు, పొరుగు అమ్మ లక్కలందరూ, ఇండ్లలో పని పాటలు ముగించుకుని సాయంత్రం వరకూ ఈ కామేశ్వరీ కథను కర్ణానందంగా వినేవారు. అందుకే 'అక్కలు లేచేవరకు నక్కలు కూసె' అనే సామెత వచ్చింది. ఈ కామేశ్వరి కథ ప్రథమంలో బ్రాహ్మణ స్త్రీల ద్వారానే ప్రచారంలోకి వచ్చినా క్రమానుగతంగా ఇతర జాతి స్త్రీలలోకి కూడ వ్వాపించి ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఈ కథ ఆంధ్ర దేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాలలో బాగా వ్యాపించింది. ఈ కామేశ్వరి కథను జక్కులవారు కూడ బహుళ ప్రచారంలోకి తెచ్చారని క్రీడాభిరామంలో వుదహరించారు.