పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/783

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సుల్తానాబాదుకు దగ్గరలో కూచిపూడి అనే గ్రామం వుంది. ఇక్కడ కూడ కూచిపూడి నృత్యముంది.

కరీంనగర్ జిల్లాలో యక్షగానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. శ్రీ గజవెల్లు వెంకట నర్సు, తీగల గుట్టపల్లి బృందం ఈ ప్రాచీన కళారూపాన్ని ప్రదర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఒగ్గు కథ బాగా చెప్పే వారిలొ మొదటి శ్రేణికి చెందిన వారు శ్రీ మిద్దె రాహులు. హనుమాజి పేటకు చెందిన రాములు పది హేను సంవత్సరాల నుండి తన బృందంతో ఒగ్గు కథలు చెపుతున్నారు. సారంగధర, గంగా గౌరి సంవాదం, నల్ల పోచమ్మ, అమెరికా రాజు కథ, కాంభోజ రాజు కథ, భక్త మార్కండేయ కథ, మాంధాత, సిరిదేవి, పెద్దమ్మ రాలు, రామాయణ భారత కథలను ఒగ్గు కథలుగా చెప్పారు.

మిద్దె రాములుతో ప్రభుత్వం, వయోజన విద్య, కుటుంబ నియంత్రణ మొదలైన కథలను ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక ఢిల్లీ, బొంబాయి లాంటి ప్రదేశాల్లో ప్రదర్శన లిప్పించింది. కొత్తపల్లి రాజమల్లయ్య, మాట్ల మల్లేశం మొదలైన వారు కూడా ఒగ్గు కథలను చెపుతూ వుండేవారు.

కరీంనగర్ జిల్లాలో బుర్రకథలు చెప్పే బృందాలలో ముఖ్యమైనది మాన కొండూరు వామన మూర్తి బృందం. ఇందిరా గాంధి స్మారక అవార్డును కూడ అందుకున్న దళం. అలాగే గట్టు దుద్దెనపల్లి వెదురు గట్టలో కూడా బుర్రకథ దళాలు పనిచేశాయి.

ముఖ్యంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలోనూ, దసరా వుత్సవాలలోనూ, కోలాటం వేయటం ఆనవాయితీ, కొండాయిపల్లె బృందం కృష్ణ లీలలు ప్రదర్శిస్తుంది. ఇంకా రాచపల్లి, వెల్లుల్ల, పెంబట్ల, కోనాపూరు, కొండన్న పల్లె గ్రామాలకు చెందిన బృందాలు కూడ కోలాటాన్ని ప్రదర్శించారు.

విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లా మాడుగులకు రెండు మైళ్ళ దూరంలో వున్న గుట్టాల పేట, హుకుంపేట గ్రామాల్లో అడవి జాతులకు సంబంధించిన ప్రజ అనే నృత్యాన్ని చేస్తూ వుంటారు.