పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రిందికి అంగరఖాను తొడుగుతారు. తెల్లని తలగుడ్డనూ చుడతారు. మెడకు పొడవాటి అంగ వస్త్రాన్ని ధరింస్తారు. ముఖానికి గంభీరంగా విభూతి రేఖలను దిద్దుతారు. గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ వచ్చే గంట జంగాన్ని సాక్షాత్తు బసవేశ్వరుడని ఊహించి ఇంట్లో వారంతా భిక్షను వేస్తారు. భిక్షను స్వీకరిస్తూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విభూతి నిస్తారు. శంభో శంకర అంటూ, గంట చుట్టూ ఒక పుల్లను త్రిప్పుతూ ఓంకార నాదాన్నీ పలికిస్తారు. పిన్నలూ, పెద్దలూ అందరూ పూజ్య భావంతో విభూతిని స్వీకరిస్తారు. ఈ రకంగా గంట జంగాలు వీర శైవ మతాన్ని ప్రబోధించే ప్రచారకులుగా జీవిస్తూ ఊరూరా తిరుగుతూ వుంటారు.


సానివారు

ఆంధ్రదేశంలో దేవ దాసీలూ, భోగం సానులూ వుండటం చాల మందికి తెలుసు. కాని మరి కొందరు సానులు కూడా జాతి జీవనంలో కళా సంస్కృతులకు దోహదం చేశారు. పూర్వకాలం నుంచీ కొన్ని కులాలలో ఆడపిల్లలను అవివాహితలుగానే విడిచి పెట్టే ఆచారం దేశంలో వుంది. అయితే అవివాహితలు విచ్చల విడితనం లేకుండా కట్టుబాట్లకు లోబడి సామాజిక కార్యక్రమాలను నెరవేర్చేవారు.

ఆనాటి మూఢనమ్మకాలతో వున్న గ్రామీణ ప్రజలు నిర్వహించే జాతర్లలో, దేవతల కొలువుల్లో జరపవలసిన తంతును వీరే నిర్వహించేవారు. ప్రత్యేక నృత్యాలను వీరే చేసేవారు. ఈ నాటికీ జక్కుల సాని,బసివి, మాతంగి మొదలైన వారి జీవిత చరిత్రలు పరిశీలిస్తే పురాతన సాంఘిక నియమాల వల్లే సానివారిగా ఏర్పడ్డారని తెలుస్తుంది.

క్రిందటి శతాబ్దంలో జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఆరు తెగల సానులు లెక్కకు వచ్చినట్లు ఆరుద్రగారు పరిశీలించారు. వారు "తురక సానులూ, గొమ్మన సానులూ, భోగం సానులూ, మంగల భోగాలూ, మాదిగ భోగాలూ అనే ఆరు తెగల సానులు లెక్కకు వచ్చారు. వీరందరూ నృత్య సంప్రదాయలను పోషించినవారే.


జోగాట

ఆంధ్ర దేశంలో ఇతర ప్రాంతాల్లో అంతగా ప్రచారంలో లేని ఈ జోగాట తెలంగాణాలో ప్రచారంలో వుంది. హరిజనులలో ఒక తెగకు సంబంధించిన వారే ఈ జోగువారు. వీరు డప్పు వాయిద్యంతో పాటు నృత్యాన్ని చేస్తారు. ఇలా చేసే