పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/755

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతి గణపదిదేవ చక్రవర్తి కాలంలో వీరిని భట్టులనే పిలిచేవారు. అందుకుదాహరణ కోలవెన్ను కాకతి గణపతి శాసనంలో కనబడుతూ వుంది. ఆ శాసనంలో దాదాపు 60 పేర్లున్నాయి. వాటిలో అన్నంభట్టు, నారాయణ భట్టు, జగదేవ భట్టు ఈ విధంగా వున్నాయి. వీరందరికీ అగ్రహారా లిచ్చినట్లు కూడా వుంది.

రాచరికాలు పోయాక, గ్రామాలలోని సంపన్న గృహస్తుల నాశ్రయించి, వారిని ఘనంగా స్తుతిస్తూ జీవయాత్ర గడుపుతున్నారు.

వీరి పొగడ్తలకూ, స్తోత్రాలకూ ఎంతటి వారైనా లొంగి పోవాల్సిందే. వీరు ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక జట్టుగా చేరి ఒకరి తరువాత మరొకరు పొగడ్తలతో ఉక్కిరి బిక్కిరి చేసి పారితోషికాన్ని పొందుతారు. అయితే వీరి స్తోత్ర పఠాలు వినడానికి గ్రామీణులు బహుముచ్చట పడతారు. అందుకే మామూలు జీవితంలో ఎవరినైనా పొగడుతూ వుంటే భట్రాజు పొగడ్త పొగుడుతున్నాడురా అంటారు.


ఎలుగుబంటి, ఎలుగుబంటి వేషాలూ

దసరా వుత్సవాలకు ఆ తొమ్మిది రోజులూ రకరకాల వేషాలను ప్రదర్శిస్తారు. అలాగే సంక్రాంతి దినాలలో కూడ విచిత్ర వేషాలను ధరించి ఇంటింటికి తిరిగి ప్రజల నానంద పరిచి, వారి నుండీ ధాన్యాన్నీ, డబ్బులనూ వసూలు చేసుకుంటారు.

ముఖ్యంగా ఈ వేషాల్లో జంతువులకు సంబంధించిన పులి వేషం పిల్లల్నీ పెద్దల్నీ ఎంతో ఆకర్షింస్తుంది. పిల్లలైతే అసలు దగ్గరకు రారు. అలాగే ఎలుగుబంటి వేషం కూడ. ఆనాటి ప్రజలకు వినోద ప్రదర్శనాలు ఇలాంటివే. వీటిని అతి నైపుణ్యంతో కళాత్మకంగా ప్రదర్శిస్తారు. అలాంటి వేషాల్లో ఎలుగుబంటి వేషం కూడ ముఖ్యమైంది. జంతువుల వేషాలను ధరించినవారు ఆ జంతువుల యొక్క పోకడలనూ విన్యాసాలనూ, గంతులనూ అరుపులనూ చక్కగా అనుకరిస్తారు.

ముఖ్యంగా ఈ ఎలుగుబంటి ముఖాన్ని కాగితపు గుజ్జుతో మోల్డు చేస్తారు. కొంత మంది అట్టలతో తయారు చేస్తారు. పాత్ర ధారి ఈ మూతిని తలకు ధరిస్తాడు. శరీర మంతా జనపనార పీచును నల్లరంగులో ముంచి ఎండబెట్టి దానిని ఒక గుడ్దమీద కాళ్ళను, చేతుల్నీ మొత్తం శరీరాన్నంతా ఆక్రమించేటట్లు చక్కగా కుట్టి ధరిస్తారు. ఎలుగుబంటి నడకనూ, చేష్టలనూ చక్కగా చేస్తారు.