పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/742

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. ప్రజానాట్యమండలి కళాకారుడుగా ఈ కళా రూపాన్ని దేశ మంతటా ప్రదర్శించారు.

ఆంద్ర జాలరిగా ప్రఖ్యాతి వహించిన సంపత్కుమార్ జాలరి వేషం ధరించి ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్టటానికి తన నావతో సముద్రంలోకి వెళతాడు. చేపల కోసం గాలిస్తాడు. ఇంతలో కారు మేఘాలతో తుపాను కమ్ముకుంటుంది. పడవ వూగిపోతూ వుంటుంది. జాలరి మెలికలు తిరిగి పోతాడు. ఇంతలో ఒక పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చేస్తుంది. అయినా పట్టు విడువని జాలరి పడవలో తల క్రిందులై పోతూనే ఎంతో కష్ట పడి ఆ చేపను ఒడ్డుకు చేర్చటం తుఫాను హోరు తగ్గి పోవటంతో విజయవంతంగా ఆనందంతో గంతులేస్తాడు. ప్రదర్శనానికి రంగస్థలం తెరమీద బ్యాక్ ప్రొజక్ష్ణన్ తో సముద్ర హోరుని చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్ తో జిగేలు మనిపిస్తారు. నేపథ్యంలో సన్ని వేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహకరిస్తాయి. ఈ కళారూపాన్ని అత్యద్భుతంగా సృష్టించిన ఘనత సంపత్కుమార్ కు దక్కుతుంది. ఈ కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని ప్రజా నాట్యమండలి రాష్ట్ర దళం జాతీయ సమైక్యతకు ఉపయోగించింది.


సుగాలీ నృత్యం

సుగాలీలంటే లంబాడీలు. ఈ నృత్యాన్ని, లంబాడీ, బంజారా తండా నృత్యమని పిలుస్తారని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు తమ జానపద నృత్య కళాగ్రంథంలో ఉదహరించారు.

అయితే వీరు ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులుగానే మిగిలిపోయారు. పల్లెలకు దూరంగా కొండ కోనల్లో నివసిస్తూ కట్టెలు కొట్టి అమ్ముకుంటూ, కూలి పనులతో జీవనం సాగిస్తారు. వీరు కష్టజీవులు. పండగల్నీ, పబ్బాలనూ సాంప్రదాయ రీతిలో చేస్తారు.

వీరి వేష ధారణలో, స్త్రీలు ప్రత్యేకమైన దుస్తుల్ని ధరిస్తారు. లంబాడీలను చూచిన వారికి వారి వేషధారణ విదితమే... వీరు తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వున్నా _ అనంతపురం జిల్లాలో కూడా వున్నారు. వీరు ధర్మవరం మండలంలో ప్రతి సంవత్సరం కాముని పున్నమి రోజున తప్పకుండా నృత్యం చేస్తారు. మత్తు పానీయాలు బాగా సేవించి స్త్రీలు నృత్యం చేస్తారు.