పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/715

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వీరప్ప నాయకుని కాలంలో:

నొబిలీకి పూర్వం మధురను పాలించిన వీరప్ప నాయకుని కాలంలో (1572 - 95) ఫాదరీ ఫెర్నాండెజ్ పద్నాలుగు సంవత్సరాలు క్రైస్తవ మత ప్రచారం చేశాడు. పరవార్ లు అనే చేపలు పట్టే మత్స్యకారుల్ని మాత్రం క్రైస్తవ మతస్థులుగా మార్చగలిగాడు.

కానీ అగ్ర కులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించక పోవటానికి ఈ క్రింది కారణాలు అడ్డు వచ్చాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు హైందవ ఆచారాల్ని విస్మరించటమూ, పరవర్ లు అనబడే మత్స్య కారులు అంటరాని వారై వుండి క్రైస్తవులు కావటమూ, క్రైస్తవ మత ప్రచారకుల్ని నీతి నియమాలూ, మానమర్యాదలూ లేని త్రాగు బోతులుగా, గోమాంస భక్షకులుగా మంచివారిని పరంగేలుగా పిలవడం వల్ల అగ్ర కులాల వారెవ్వరూ క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు.

మతం కోసం మార్చిన వేషం

ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొన్న "నొబిలి" తన ప్రచారం కోసం తన వేషభాషల్నీ, ఆచార వ్వవహారాల్నీ మార్చివేసి సన్యాసిగా కాషాయ వస్త్రాలను ధరించాడు. జంధ్యం వేసుకున్నాడు. ముఖానికి విభూతి రేఖలు దిద్దాడు. చేతిలో కమండలాన్ని ధరించాడు. శాఖాహారిగా ఒక చిన్న గుడిసెలో కాపరం పెట్టాడు. జగద్గురు తత్వ బోధక స్వామిగా పరసిద్ధి చెందాడు. బ్రాహ్మణులతో కలసి మెలిసి తిరిగాడు. ఇలా నొబిలీ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయాలకు చోటు సంపాదించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు కొనసాగుతున్నాయి. మధురలో క్రైస్తవ వేదాంత కళాశాల క్రైస్తవ మతాన్ని పూర్తిగా హైందవీకరణం చేయడానికి కృషి చేస్తూవుంది.

క్రైస్తవులు మన దేశ సంస్కృతికి అనుగుణంగా తమ మతాన్ని ప్రబోధించాలనుకున్నారు. తర తరాలుగా వస్తూవున్న ప్రచార సాధనాల్నే ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇలా అయితే విషయం ప్రజల్లోకి సులభంగా చొచ్చుకు పోతుందని వారి విశ్వాసం. అందుకు అనువుగా మన జానపద కళారూపాల్లో 'హరికథ ' 'బుర్ర కథ ' 'భజనలు ' 'కోలాటాలు ' మొదలైన వాటిని ఎంచుకున్నారు.