పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక ప్రదర్శనశాలగాను, విద్యాస్థానం గాను అలంకరించాడు. ఆయన ఏర్పాటు చేసిన దేవాలయాలలో మూడువందలమంది సానులు, మూడువందల మంది మానులు కలిసి దేవాలయ కార్యాలయాలను నిర్వహించేవారట.

ఆటకత్తెల కోలాటాలు:

సామర్లకోట భీమేశ్వరాలయంలోని నందిమండప స్తంభాలమీద చెక్కబడిన గాయకీ, నర్తకీ, శిల్ప ప్రతిమలు ఆ కాలపు తూర్పు చాళుక్య శిల్ప కళకు ముఖ్య లక్షణాలు. ఇక్కడ హల్లీసకమనే దేశీ లాస్యం (కోలాటం) చూపబడింది. ఇందులోని ఆటకత్తెలు జతలు జతలుగా చీలి ఆటయెక్క లయ కనుగుణంగా కోలాటపు కోలలతో తాళం వేస్తున్నట్లుంది.

ద్రాక్షారామంలోను, సామర్ల కోట, భీమవరంలోనూ గల భీమేశ్వరాలయాలలో కోలాటం వేసే నర్తకీ మణుల ప్రతిమల వరుసలను స్థంభాలమీద చూడవచ్చు. సంగీతం, నృత్యం మొదలైన లలిత కళల మీద ఆకాలంలో ప్రజల కుండిన ఆదరణను వ్వక్తంచేసే ఇటువంటి శిల్ప కల్పన తరువాత శతాబ్దాలలో ఇంతకంటే అధిక ప్రజాదరణకు పాత్రమై వుండటం విజయనగర చరిత్ర వల్ల తెలుస్తూ వుంది. ద్రాక్షారామ భీమేశ్వారలాయాన్ని 10 వ శతాబ్దంలో చాళుక్య భీమరాజు నిర్మించాడని ప్రతీతి.

అవతరించిన ఆదినన్నయ మహాభారతం:

ఒక విశిష్టమైన జాతిగా చాళుక్యరాజుల కాలంలో ఆంధ్రులు స్థిరపడ్డారు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ దేశాన్ని క్రీ॥శ॥ 1022 నుండి 1063 వరకూ పాలించాడు. అన్నదమ్ముల కలహాలతో వేసారిపోయిన రాజరాజనరేంద్రుడు అన్నదమ్ముల కలహగాథైన మహాభారతగాథను ఆస్థానకవియైన నన్నయ భట్టారకునిచే వ్రాయించడానికి 1050 ప్రాంతంలో పూనుకున్నాడు. కాని ఆంధ్ర మహాభారతం అసలు నన్నయ ప్రారంభించినా ఏ కారణాల వల్లనో ఆ తరువాత రెండువందల సంవత్సరాలకు _ 1260 లో కాకతీయ గణపతి చక్రవర్తి ఆస్థానంలో ఉన్న తిక్కన ఆ మహాభారతాన్ని పూర్తిచేశాడు. ఈ విధంగా మహాభారతం తెలుగు గడ్డమీద అవతరించింది.