పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్వరుడు స్వయంగా నాట్యాచార్యుడు. వట్టపు, గొండ్లి అనే నృత్యంలోని దోషాలను ఎవరో అడుగగా, దోషాలను సరిదిద్ది ఆడి చూపించాడు. నాటి రాణులూ సంగీత, నృత్త, వాద్యాది విద్యల్లో ఆరితేరిన వారు.

గౌడుగీతాలు, ఊయల పాటలూ:

చాళుక్య రాజు దేసి కవితను ఆంధ్ర దేశంలో నిలిపారనీ, కవిత్వంలోనూ దేసి, మార్గరీతులున్నట్లూ నన్నె చోడుడు కుమార సంభవంలో తెలియజేశాడు. కుమార సంభవమే ఆంధ్రుల మొట్టమొదటి ప్రబంధంగా పేర్కొనవచ్చు. చాళుక్యరాజుల కాలంలో ప్రజలు ఊయల పాటల్ని, గౌడు గీతాలను పాడుతూ వుండేవారని అభిలషితార్థ చింతామణిలో ఉదహరింపడింది.

వినోదాలను వర్ణించిన నన్నెచోడుడు:

ఆ రోజుల్లో బాలబాలికలు చిలక బొమ్మల్ని, దంతపు బొమ్మల్ని, తోలు బొమ్మల్ని, తయారు చేసి ఆడుతూ వుండేవారట. నన్నెచోడుడు తన కుమార సంభవం లో ప్రప్రథమంగా రంభ నాట్య వర్ణనను గురించి ప్రస్తావించాడు. ఆనాటి వినోదాల్లో అనేకం నేటివరకూ నిలిచి వున్నాయి. ఆనాడు అంకమల్ల వినోదం, కోళ్ళ పందాలు, లావక పిట్ట కొట్లాటలు, మేషమహిష యుద్ధాలు, పాపురాల పోట్లాటలు, గీత వాద్య నృత్యాలు, కథలు, ప్రహేళికలు, చదరంగం, పాములాటలు, మోడీలు, గౌడి, మాద్వి మొదలైన వెన్నో వున్నట్లు అభిలషితార్థ చింతామణి నుండి సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఉదహరించారు.

సానుల్ని పోషించిన చాళుక్య చోళులు:

చాళుక్య చోళయుగంలో రాజులు యుద్ధంలో విజయం పొందినప్పుడు వారి విజయ పరంపరల ఆనందంలో శివ, విష్ణు విగ్రహాలను ప్రతిష్టింప జేసి ఆలయాలను నిర్మించడంతో పాటు, స్వామివారి ధూప, దీప నైవేద్యాది అంగ, రంగ వైభోగాల నిమిత్తం సాని, మాని, నిబంధనకారులను దాసరి నాయకము లేర్పాటు చేసి వృత్తులిచ్చి క్షేత్రవైభవాన్ని పెంచారు.

ఈ రీతిగా ఈ కాలంలో దేవాలయాలలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, సాహిత్యాది లలితకళలను అఖండంగా పోషించాడు. ఆయన తన ఆస్థానం