పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సమగ్ర పరిశోధన విశేషమనీ, సంస్కృతీ చిహ్నాలైన వస్తువుల్ని సేకరించటం అవసరమనీ, అవి గిరిజన సంస్కృతిని తెలుసు కోవడం కోసం ఉపయోగపడతాయనీ, అందుకోసం కృషి జరుగుతూ వుందనీ, ఆ కృషిలో భాగంగా యం.ఎ. రవూఫ్ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో గిరిజనుల సంగీత వాయిద్యాలను గురించి వివరించారు.

సంగీత వాయిద్యాలు

గుమేళా:

గుమేళా అనే ఈ వాయిద్యాన్ని కుమ్మరి మట్టితో తయారు చేస్తారు. లోపలి భాగం అంతా డొల్లగా వుంటుంది. స్థూపక ఆకారంలో వుంటుంది. ప్రక్కన మేక చర్మంతో సాగదీసి బిగిస్తారు. దండారి నృత్యం జరిగే సమయంలో గోండు జాతి వారు ఈ వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తారు.

డగ్గుడు:

అలాగే డగ్గుడు అనే వాయిద్యాన్ని సవర జాతి వారు ఉపయోగిస్తారు. ఈ వాయిద్యం యొక్క ఆకారం మద్దెలలా వుంటుంది. దీనిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవరలు వారి జాతిలో ఎవరైనా మరణించినప్పుడు సంతాప సమయంలో దీనిని వాయిస్తారు. అలాగే పితృ దేవతలకు శ్రాద్ధ ఖర్మలు జరిపే ఆగుగామా సమయంలో ఉపయోగిస్తారు.

కిరిడి:

ఈ వాయిద్యాల పేర్లే ఎంతో ఆసక్తి గలిగించేవిగా వున్నాయి. కిరిడి వాయిద్యం మట్టితో తయారు చేయబడే డ్రమ్ము వాయిద్యమిది. పై భాగాన మేక చర్మాన్ని అమరుస్తారు. రెండు చిన్న కఱ్ఱ పుల్లలతో మోరీ బాణికి అనుగుణంగా ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు.

తప్నా:

రెండు అడుగుల వ్వాసం కలిగిన ఒక్ కొయ్య చట్రానికి, ఎండబెట్టిన మేక చర్మాన్ని, గట్టిగా లాగి బిగిస్తారు. డప్పు, డంగ్, అనే రెండు చిన్న పుల్లలతో అదిలాబాద్ జిల్లాలో వున్న రాజగోండులు దీనిని వాయిస్తారు.