పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/402

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గనుక వీరిని చిందు మాదిగలు అని పిలుస్తూ వ్చారు. సంఘంచే వీరు కడజాతి వారుగా చూడబడ్డారు. వీరులక్ష్మీ ప్రసన్నులు కాకపోయినా, సరస్వతీ పుత్రులు.

తెలుగు వారు ఒక విశిష్ట తెగగా ఏర్పడి తెలుగు భాష దేశ భాషల్లో ప్రాముఖ్యత సంపాదించినప్పుడే వీరుకూడ ఆజాతిలో ఒక భాగంగా జీవిస్తూ ఆటపాటల్లో దేశాన్ని అలరింప చేస్తున్నారు. ఇది వీరి కళల యొక్క ప్రాచీనత.

ఈ చిందు జోగితలు ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలోని నిజామాబాద్... అదిలాబాద్ ...కరీం నగర్ మెదక్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరు రామాయణ, భారత, భాగవత కథల్ని నృత్య నాటకాలుగా ఆడుతారు. మన ప్రాంతాల్లో పగటి వేషధారులు పగటి పూట ఎలా పగటి వేషాలను వీథుల్లో ప్రదర్శిస్తారో వీరు కూడా అదే మాదిరి, పగటి పూటే తమ ప్రదర్శనాలనిస్తారు. స్త్రీలు పురుషులు కూడ అదే మాదిరి, పగటి పూటే తమ ప్రదర్శనాల నిస్తారు. స్తీలు పురుషులూ కూడ ప్రదర్శనాల్లో పాల్గొంటారు. బృందాలుగా ఏర్పడి ప్రదర్శనాల నిస్తారు. వీరు షుమారు ఏబై యక్షగానాల వరకూ ప్రదర్శిస్తారు. వీరి ప్రత్యేకత పాడుతూ ఆడతారు. వారికి కావలసిన ఆలంకరణకు సంబందించిన, వస్తువుల్నీ, దుస్తుల్నీ వారే తయారు చేసుకుంటారు. అవి ఎంతో ప్రవీణతో తయారు చేయ బడతాయి.

జోగితలు:

చిందు జోగితలు ఇంచు మించుగా ఒకే తెగకు చెందిన వారైనా, వీరిలో కొన్ని భేదాలున్నాయి. జోగిత అనే పదాన్ని ఒక బిరుదుగా వుపయోగించేవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి... అలంపురం జోగులాంబ పీఠం ... ఆ దేవి సేవలో అంకితమై నృత్య మాడే వారు గనుక వారిని జోగులాంబలు అని పిలవటంఆచార మైంది.

జోగుల వారని పిలువబడేవారు, నృత్య నృత్తములను మాత్రమే ప్రదర్శిస్తారు. జోగు ... చిందుల స్త్రీలు, నృత్త నృత్యాలతో కూడిన యక్షగానాలను ఆడతారు. ఒక్కొక్క దరువూ ఒక్కొక్క సందర్బంలో ప్రదర్శిస్తారు.

వారి ప్రదర్శనంలో, మృదంగం ... తాళం... చిప్పలు ... గజ్జెలు ... హర్మోనియం శృతి మొదలైనవి ప్రధానంగా వాయించే వాయిద్యాలు నటులు. నేపద్యంలో వుండి వంట పాడుతారు.