పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రదర్శనాని కంతా ప్రధాన కథానాయిక ఎంత అవుసరమో, హాస్య పాత్ర ధారి కూడ అంత ముఖ్యం. గొల్ల కలాపంలో మన నాటకంలో మాదిరి, భాగవతంలో మాదిరి వచ్చీ పోయే పాత్రలేమి వుండవు. ఒకసారి రంగస్థలం పైకి ప్రత్యక్ష మైతే ఆ ముగ్గురూ ఆసాంతం వుంటూనే వుంటారు.

హాస్యకాని బరువు బాధ్యతలు:

గొల్లకలాపంలో చెప్పబడే అనేక మైన ఉదాత్త విషయాలను పై మూడు పాత్రలే వుదాహరించాలి. ఇలా వివరించడం లోనూ ప్రేక్షకులకు ఏవిధమైన విసుగూ లేకుండా ప్రదర్శించాలి. ఇది చాల కష్టమైన విషయం. కాని మన హాస్యకాడు వినోదం తోనూ, పిట్టకథల తోనూ, ప్రజా జీవితంలో నిత్యం వాడబడే అనేక చాటువుల తోనూ ప్రేక్షకుల నందరినీ సమాళించి చమత్కారంగా తన వశంలో వుంచు కుంటాడు.

మూడు రోజుల నుంచె ఒకే రోజుకు ప్రదర్శన కాలం కుదింపు:

గొల్ల కలాపాన్ని ప్రదర్శించాలంటే ప్రతి రాత్రీ ఏడు గంటల చొప్పున ప్రదర్శిస్తే కనీసం మూడు రోజులకు గాని పూర్తి గాదు. చిత్తజల్లు వారూ ప్రథమంలో ఈ కార్యక్రమాన్నంతా వరుసగా మూడు రోజులూ ప్రదర్శించే వారు. కాని, రాను రాను ప్రజలలో చూచే వుత్సాహం, వినే ఓపికా తగ్గటం, చాలమంది పండితులూ రసికులైన ప్రేక్షకులూ కూడ తగ్గటం వల్ల ప్రదర్శనకాల పరిమాణం విధిగా తగ్గిపోయి, ప్రజలకు ఖచ్చితంగా కావలసిన ఖరారు ఘట్టాలనే ప్రదర్శిస్తూ కిందా మీదా బడి ఎలాగో ఓలాగు కుదించి ఒకే రోజున ప్రదర్శనాన్ని ముగిస్తూ వచ్చారు;

గంధర్వ కన్యల వనవిహారం.

గొల్లకలాప ప్రదర్శన్నానే కాక వీరు వనవిహార మనే మరో ప్రదర్శనాన్ని కూడ ప్రదర్శించే వారు. ఈ ప్రదర్శనం గురించి ప్రత్యేకించి చెప్ప దగ్గవి కథా విధానం. ఇద్దరు గంధర్వకన్యల మధ్య జరిగే సంభాషణా విధానం.