పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గొల్లకలాపాల ప్రదర్శన పద్ధతి:

గొల్లకలాప ఇతివృత్తాన్ని గురించి కూచిపూడి భాగవతాలు అన్న శీర్షికలో చర్చించాం. గొల్లకలాప ఇతివృత్తంలో అనేక రకాలైన కీర్తనలు, మట్లు, గమకాలు వుంటాయి. మంచి సాహిత్యం, సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతానికి తగిన ఫణతులు, వీటన్నిటికీ తగిన నాట్యంతో గొల్ల కలాప ప్రదర్శనం ఒక కమ్మని కళా ఖండంగా ప్రదర్శింప బడుతుంది.

గొల్లకలాప ప్రదర్శనంలో ఆనాడు ఏవిధ మైన తెరలూ వుపయోగించ లేదు. ప్రదర్శనం ప్రారంభించి, సాంతమయ్యే వరకూ నటీ నట బృందమంతా రంగస్థలం మీదే వుంటారు. ప్రధాన నాయకకు సహాయంగా, మరో సహాయ నాయిక వుంటుంది. వీరిద్దరూ కాక కథా గమానాన్ని అత్యంత చమత్కారాలాతో ప్రేక్షకులకు కథలా కళ్ళకు కట్టినట్లు ప్రతిభావంతంగా చిత్రించే విదూషక పాత్ర ధారి వేరే ఒకడు వుంటాడు. ఇతనిని హాస్యగాడు అనిపిలిచేవారు. వీరు ముగ్గురే గొల్లకలాప ప్రదర్శనానికి నటీ నట వర్గమని చెప్పవచ్చు. వీరు గాక వీరికి హంగు దార్లుగా ప్రక్క వాయిద్యాలు, మృదంగం, ఫిడేలు, హర్మోనియం, తాళగాండ్రు వుంటారు. హాస్య పాత్రధారి, సహాయ కథానాయిక కూడ తాళం వేస్తూ వుంటారు. ఇతర కళా రూపాల్లో వలెనే ఇస్ట దేవతా ప్రార్థన, విఘ్నేశ్వర స్తుతి, సరస్వతీ పూజ మొదలైన సంప్రదాయాలను కూడ అక్షరాలా పాటించేవారు.

సంశయాలూ, సందేహాలు తీర్చే భాష్యకారుడు హాస్యగాడు.

కథా గమనంలో, అందరికీ అర్థమయ్యే శైలిలో, మధ్య మధ్య అనేక పిట్ట కథల ద్వారా, ప్రేక్షకులకు వచ్చే సందేహాలను తానే కథా నాయికని ప్రశ్నించి ఇతగాడు కథలో వచ్చే చిక్కులన్నీ సుబోధకం అయ్యేలా చేస్తాడు.

గంభీరమైన అనేక విషయాలను కరబదరీ సమానంగా వివరించి, ప్రేక్షకులకు విసుగు జనించ కుండా తన అద్భుత చమత్కృతితో పండితుల నుండి పామరుల వరకూ అందర్నీ రంజింప జేసే వైజ్ఞానికి పాత్ర ధారి మన హాస్యగాడు.