ఈ పుట ఆమోదించబడ్డది
ఈ విధంగా ఎన్నో వరుసలతో జోడు గుమ్మెటలు ముక్తాయింపులతో వాయిస్తూ వుండే కథ ఎంతో రస వత్తరంగా నడుస్తుంది. వరుసలకు తగినట్లుగా కథకుడు నృత్యం చేస్తూ వుంటే ప్రజలు వుత్తేజితులౌతారు. ముఖ్యంగా రౌద్ర ఘట్టాలతో గుమ్మెటల మ్రోతలు, పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ వుంటాయి. కథకీ, కథకునకు గుమ్మెట్లే ప్రాణం.
- బుర్రకథలో వంత పాటలు:
బుర్రకథకు జీవం వంతలు. వంతల బలం లేక పోతే బుర్రకథకు అందం లేదు. కథకుడు చరణం పాడిన తరువాత ఆయా కథకులు వారికి తోచిన వంత పాటను కథకునకు అండగా ఈ విధంగా పాడతారు.
శ్రీధేనువు గిరిధామా యదుకుల క్షీరాంబుధి సోమా.
అనీ
వినరా భారత వీరకుమారా, విజయము మనదేరా
అనీ
కూడి చరించిన విజయము మనదే కూలి రైతులారా
అనీ,
జయము జయము మన మహిళలందరకు జయము కలుగుగాక
అనీ,
సంఘోద్దరణ విచారాధీరా, సహజ గుణధామ
పండిత వితండ వాద ఖండనా, ప్రజాభాష పోష
మహిళావుద్యమ నిర్మాతా, ఓ మహిత గుణవిశాల.
అనీ,
వినరా నైజాం తెలుగు ప్రజల ఘన వీర సమర చరిత.
అనీ.
తంధానా, తాన తంద నానా,
భళానోయి భాయి తమ్ముడా భాయి భళానోయి తమ్ముడా,
భాయి భళానోయి దాదానా.
తందన భాయిదేవ నందనానా