పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారువేషాలతో కోటల్లో జొరబడి, ఒక రాజు మరొక రాజును వంచించడం కోట లోని గుట్టుమట్టులూ, బలహీనతలూ తెలుసుకుని యుద్ధం ప్రకటించడం జరుగుతూ వుండేది. ఈ విధంగా బయలు దేరినవే పగటి వేషాలు;

పేరువచ్చిన కారణమూ, తీరూ.

ప్రజా వినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు బహుళంగా రాత్రివేళలయందే ప్రయోగిస్తూ వుండేవారు. అలాకాక పగటి పూట ప్రదర్శించే ప్రదర్శనం అవడం వల్ల ఈ ప్రదర్శనకు పగటి వేష ప్రదర్శనమని పేరు వచ్చింది.

పగటి వేషాల్లో ముఖ్యంగా గమనించాల్చిన విషయ మేమిటంటే వారు కేవలం తమ వేష ధారణతోనే కాక వారి పాత్రలద్వార సంఘంలో వుండే మూఢనమ్మకాలనూ, మతాచారాలనూ, ప్రజాపీడననూ, హాస్య ధోరణిలో పెట్టి ప్రజలకు వినోదం ద్వారా విజ్ఞానపరుస్తూ వుండేవారు. ఈ నాటి కంటే ఆ నాడు ముఖ్యంగా గ్రామాల్లో పెత్తందారులు, కరణాలూ, మునసబులూ, వర్తకులూ లంచగొండి ఉద్యోగులూ మొదలైన వారంతా ఎలా మోసం చేస్తూ వుండేవారో వీరు వేషణ ద్వారా తగిన సాహిత్యంతో ఎవ్వరికీ నొప్పి తగల కుండా హాస్య ధోరణిలో వ్యంగ్యంగా గుట్టును బట్టబయలు చేసే వారు.

ప్రాచీనం నుండీ, ప్రచారంలో వున్నవే:

ఎన్నో సంవత్సరాల నుండీ జానపద కళారూపాలు ఎలా ప్రచారంలో వున్నాయో అలాగే ఈ పగటి వేషాలు కూడా ప్రచారంలో వున్నాయి.

ఈ నాటి పగటి వేషాలను పూర్వం, బహురూపాలని పిలిచేవారు. బహురూపాల గూర్చి భరత కోశంలో ఈ ద్రింది విధంగా ఉదహరించబడి వుంది.

దేశి నృత్య నానావేష ధరం.

యత్తత్ బహురూప మితీరితమ్ (భరత కోశం పుట 418 క్రీస్తు శకం 12342 వ సంవత్సరంలో యథావాక్కుల అన్నమయ్య తనచే రచింపబడిన సర్వేశ్వర శతకంలో నాటక ప్రదర్శనాలను గురించి వ్రాసూ ఈ క్రింది పద్యం ద్వారా నాటకాలు బహురూపాలని వివరించాడు.