పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
దేశదిమ్మర్లు:

బొమ్మలాట లాడేవారు వూరు తరువాత వూరు చాంద్రాయణం చేసుకుంటూ ప్రదర్శనలిచ్చుకుంటూ దేశదిమ్మర్లుగా తిరుగుతూ వుంటారు. చావులు, పుట్టుకలూ, వివాహాలూ, వేడుకలూ అన్నీ దానిలోనే జరిగిపోతూ వుంటాయి.

వీరిలో ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు భార్యలు కూడ వుంటారు. ఇలా వుండటం వారికి తప్పు కాదు. కారణం ఈ స్త్రీలందరూ ప్రదర్శనంలో పాటలు పాడటానికి, బొమ్మల నాడించటానికి ఉపయోగపడతారు. అందువల్ల బయటనుంచి కిరాయికి నటుల్ని తెచ్చుకోవాలిసిన అవసరం వుండదు. అంతే గాక ప్రదర్శనం రోజున ఒకరికి జబ్బు చేసినా, గొంతు పోయినా ప్రదర్శనం ఆగదు. ఈ బాధ్యతలు అదనంగా వున్న స్త్రీలు పంచు కుంటారు. బొమ్మలాట వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది వుంటారు. ఎంత మంది వున్నా వారి కంఠాలన్నీ కోకిల కంఠాలే. పుట్టుక తోనే వారికి ఆ లక్షణాలు అబ్బుతాయా అన్నట్లుంది.

తోలుబొమ్మలు ఒకనాడు తెలుగు విజ్ఞాన వికాసాలకు పట్టుగొమ్మలు. తోలు బొమ్మల్ని ఆనాడు ప్రజలు ఎంతగానో పోషించారు. రాను రాను నాటకాలు అభివృద్ధి లోకి రావడంవల్లా, సినిమా కళ అభివృద్ధి చెందటం వల్లా ఈ కళ కొంతవరకు దెబ్బతిని పోయిందని చెప్పవచ్చు.

ఆనాటి తోలుబొమ్మలాటవారిలో ఎంతో సంగీతం, సాహిత్యం, శిల్పం మొదలైన వాటిలో విద్వాంసులుండేవారు. ఈ నాడు అటువంటి వారు తగ్గిపోయారు. ఉన్న కొద్దిమందీ నాశిరకం ప్రదర్శనాల నిస్తున్నారు.

ఆచార్య యం. వి. రమణమూర్తి:

శిథిలమైన తోలుబొమ్మలాటలను ఆధునిక రీతిలో పునరుద్ధరించటానికి కాకినాడ వాస్తవ్యులు యం.వి.రమణమూర్తిగారు ఎంతో కాలంగా కృషి చేస్తున్నారు. వీరికి భారత ప్రభుత్వం రెండు సంవత్సరాలు స్కాలర్ షిప్ ఇచ్చి, తోలు బొమ్మల పరిశోధనకు అవకాశం కల్పించారు. రమణ మూర్తి గారు దాదాపు 15 సంవత్సరాలు ఈ కృషిలో వుండి అనేక మహాసభల్లోనూ, ప్రముఖ నాయకుల సమక్షంలోనూ, విదేశీ రాయ