పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రదర్శనం, ప్రేక్షకుల హడావిడి:

తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు, గ్రామ చుట్టు ప్రక్కలున్న పెద్దలు, పిల్లలూ, స్త్రీలూ అందరూ హెచ్చు తగ్గుల భేదాలు లేకుండా ఒకరికంటే ఒక ముందుకు వచ్చి కూర్చుంటారు. కథా ప్రారంభం నుండి ఆసాంతం వరకూ రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. ప్రతి ఘట్టంలోనూ వారు కదిలి పోతారు. హాస్య ఘట్టాలలో ఎంతగా పగలబడి నవ్వుతారో అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాల్లో కళ్ళవెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్యం ఘట్టాలలోనూ, దుర్మార్గపు సన్నివేశాలలోనూ, ఆయా పాత్రలమీద పళ్ళు పటపాటా కొరుకుతారు. ఈ విధంగా పండితుల మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంతో మునిగి పోతారు.

జుట్టుపోలిగాడు, బంగారక్క:

ఈ బొమ్మలాట ప్రదర్శనాలను ఇంత ఆపేక్షగా ప్రజలు చూడడానికి కారణం లేక పోలేదు. తెలుగు నాట బొమ్మల ప్రదర్శనాలలో విచిత్రమైన హాస్య పాత్రలను చూపుతారు. ఈ పాత్రలు కథా ప్రారంభం నుండి కథాంతం వరకూ అడుగడుగునా కథాగమనంతో ఒక ఘట్టం అయిన తరువాతి రెండవ ఘట్టం ప్రారభమయ్యే వ్వవధిలో ప్రత్యక్షమౌతూ వుంటాయి. ఆ పాత్రలే జుట్టుపోలిగాడు, బంగారక్క. ఈ రెండు పాత్రలూ హాస్యం ద్వారా, దీర్ఘ కాలం ప్రదర్శించే ప్రదర్శనంలో మధ్య మధ్య వారిని కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు వదలగొడుతూ వుంటాయి. ఈ పాత్రల హాస్యం బహు మోటుగా వుంటుంది. నవ్వుతో కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేస్తారు. సమాజంలో వున్న కుళ్ళును, ఈ బొమ్మలను అడ్డంగా పెట్టుకుని కుళ్ళగిస్తూ వుంటారు. మధ్య మధ్య విసుర్లూ విసురుతూ వుంటారు.

మరో బపూన్ అల్లాటప్పగాడు:

తోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవర కెళ్ళిందో అల్లటప్పగాడిని గురించి తెలుసుకుంటే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు, బంగారక్క కాక వీడు మూడవ వాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే 'తాడెక్కే వాడుంటే వాడి తల దన్నే వాడుంటా'