పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రామనాటకం:

తోలుబొమ్మల ఆటలు ఆడేవారి సాహిత్యమంటూ మనకు ఈనాడు ఏదీ లభ్యం కాదు. కాని వారు యక్షగానాలనే బొమ్మలాట సాహిత్యంగా కూడ ఉపయోగించుకున్నారు. క్రీస్తు శకం 1850 ప్రాంతాల్లో గంజాం జిల్లా గుజ్జువాడ నివాసి మరింగంటి భట్టరు రామానుజాచార్యుల శ్రీరామ నాటకం బొమ్మలాటగా ప్రసిద్ధి జెందింది. ఇందులో కథ ముఖ్యంగా లక్ష్మణ మూర్చ. ఇందులోని పాటలూ, పద్యాలూ, దరువులూ మొదలైనవి మాధవపట్నం బొమ్మలాట వారి లక్ష్మణ మూర్చలో కనబడతాయి. భట్టరు రామానుజాచార్యులు వ్రాసిన తాళపత్ర ప్రతి చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది.

బాణాసుర నాటకం:
TeluguVariJanapadaKalarupalu.djvu

1893 లో కోట వెంకటప్పయ్య శాస్త్రిగారనే ఆయన బాణాసుర నాటకాన్ని రచించాడు. వీరి నివాస స్థలం పర్లాకిమిడికి దగ్గరలో వున్న పాత పట్నం గ్రామం. ఆయన ఆ నాటకానికి పీఠిక వ్రాస్తూ "ఈ గేయ ప్రబంధము చర్మ విగ్రహముల చేత ఆడించుటకును, వేషములు ధరించి నాటక మాడుటకును అనువుకూలముగ నుండునట్లు రచింపుడని నా మిత్రులు కొందరు ప్రోత్సాహ పఱచి నందున నేనిందుల కియ్యకొంటి" నని వ్రాశారు. దీనిని 1894 లో ఇండియన్ లా ప్రెస్ లో ముద్రించారు. వీరు బాణాసుర నాటకంలో తోలు బొమ్మల జుట్టుపోలిగాడి మాదిరి 'లొట్టకిత్తడు', 'రత్నాల పోలిగాడు' అనే రెండు హాస్య పాత్రల్ని సృష్టించారు.

సంతవేలూరు కుశలవుల నాటకం:

అలాగే వీణె సుబ్బరాజు, గాజుల పెండ్లూరి శేషగిరి రాజు అనే ఇరువురు కవులు కలిసి సంత వేలూరు కుశలవుల నాటకాన్ని, ఆరు రాత్రిళ్ళు ప్రదర్శించడానికి అనువుగా వ్రాశారు. దీనిని బొమ్మలాటగాను, వీథి నాటకంగాను, యక్షగానంగా కూడ ప్రదర్శించేవారట. 'బొమ్మలాట హాస్య నాటక' మనే కేతిగాని పెళ్ళి ఇతి వృత్తంగా గల తాళపత్ర నాటకం మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో వుంది.