పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ సూత్రధారి మన కంటికి కనిపించడు. వెలుగు తక్కువలో ప్రదర్శించడం వల్ల, ఆడించే ఆ సూత్రాలూ, త్రాళ్ళు మనకు కనిపించవు. జీవం లేని ఆ కొయ్యబొమ్మలు జీవం గల బొమ్మలుగా ప్రదర్శింప బడుతున్నాయనే భ్రమను చూపరలకు కలిగిస్తాయి. ఈ ప్రదర్శనం చూడడానికి పరమాద్భుతంగా వుంటుంది.

బొమ్మలాటల్ని ఆడించేవారి ఇంటిపేరులు కూడ బొమ్మలాట సోలయ్య__ బొమ్మలాట వెంకయ్య__ బొమ్మలాట గురవయ్యగా మారిపోయాయి. అలాగే వూళ్ల పేర్లు కూడ బొమ్మలాట పేరుమీద వున్నాయి. అందుకు వుదాహరణ బళ్ళారి జిల్లాలో "బొమ్మలాటపల్లె" అనే వూరు వుండటమే. దాదాపు నశించి పోయిన ఈ కొయ్య బొమ్మలాటలకు నిదర్శనంగా మైసూరు జానపద వస్తు ప్రదర్శనాలయంలో ...రావణాసురుడు లాంటి కొయ్య బొమ్మల్ని చూడవచ్చు.

అయితే ఈ కొయ్యబొమ్మలాటలు అనాదిగా ఆంధ్రదేశంలో ఉన్నాయని చెప్పవచ్చు. నాటకాలు రాక ముందు ఈ బొమ్మలాటలే ప్రజల విజ్ఞాన వినోదాలకు తోడ్పడ్డాయి. కేవలం బొమ్మలాటల్నే వృత్తిగా పెట్టుకుని జీవించినవారు ఆ నాటికీ, ఈ నాటికీ వున్నారు. అందాకా ఎందుకు? దసరా వుత్సవాలలో ఆ రోజుల్లో పిల్లలు తాడుగట్టి ఆడించే హనుమంతుడి బొమ్మ చూడడానికి ఎంతో వినోదాన్ని కలిగించేది.

బొమ్మలు తయారై ప్రదర్శనానికి సిద్ధపడిన తరువాత బొమ్మను ఆడించే వ్వక్తి ఆ బొమ్మ యొక్క పూర్తి మనస్తత్వాన్ని, పాత్రాభినయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని అందుకు అనుగుణంగా పాత్ర యొక్క ఔచిత్యాన్ని తాను అనుభవించి ఆయా బొమ్మల పాత్ర ఔచిత్యాన్ని కాపాడుతూ హృద్యమంగా ప్రదర్శించేవారు.

బొమ్మలాటల కోసం కాకపోయినా ఈ నాటికి బ్రతుకు తెరువు కోసం కొయ్య బొమ్మలను తయారు చేసి ఆయా యాత్రాస్థలాలలో ప్రదర్శించే వారిని అనేక మందిని చూడవచ్చు. ఆ నాడు ఒకందుకు తోడ్పడిన బొమ్మలు ఈ నాటు ఒకందుకు తోడ్పడుతున్నాయి.

బొమ్మల తయారీ:
TeluguVariJanapadaKalarupalu.djvu

కొయ్య బొమ్మలకీ తేలికైన బూరుగ, బాడిసె మొదలైన బరువు తక్కువ గల చెక్కలను ఉపయోగిస్తారు. బొమ్మల్ని చెక్కడానికి అనువైన తేలికగా చెక్కడానికి వీలుండే కొయ్యను ఎంచుకుంటారు.