పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

జానపద కళారూపాలు


జోగారావుగారి నిర్వచనం:

ఈ ప్రసక్తిని బట్టి బహురూపమనేది ఒక అక్కజపు వినోద విద్య అనీ, అది బహుశా బహు కంఠశ్వర విక్షేప సహితమైన బహు రూప వేషధారణతో కూడినదనీ, అది మేళంగట్టి ప్రదర్శింప బడేదనీ, అందులో భాషకు సంబందించిన క్రియలన్నీ వుంటాయనీ ప్రదర్శన ప్రవర్తకుడుగా ఒక సూత్రధారుడు వుంటాడనీ పై విషయాలను బట్టి విదితమౌతుందని, యస్వీ జోగారావు గారు నాట్యకళ జానపద కళా సంచికలో ఉదహరించారు.

అన్నమాచార్య పెద్ద కుమారుడు పెద తిరుమలయ్య తాను వ్రాసిన వెంకటేశ్వర విన్నపాలలో బహురూపాల్ని గురించి మరింత వివరంగా విశదీకరించారు.

సర్వేశ్వరా అవధారు జగంబు నీ నాటకశాల
నే నెత్తిన తొలి జన్మంబుల యాకారంబులు
నీ ముందర నాడెడు బహురూపంబులు
దార సుత బంధు జనులు మేళగాండ్రు
నిన్ను నుతియించు వేదశాస్త్ర పురాణ
చయంబు తూర్యత్రయంబు

బహురూపానికి తిరుమలయ్యగారిచ్చిన వివరణలో మేళగాండ్రు, తూర్యత్రయం, నాట్యం, భాషావిషయాలు, కొలువు, నర్తకులం అనే మాటలు బహురూప విశేషాలను వివరిస్తూంది.

దీనిని బట్టి బహురూప మనేది సామాన్యమైన నాట్య ప్రక్రియ వంటిది కాదని తెలుస్తూంది.

ఎదో ఒక విశిష్టమైన ప్రక్రియగా మనకి తోస్తూంది.

చతుర్విధాభినయాల సమ్మేళనంతో నృత్యగీత వాయిద్యాలతో మేళం కట్టి, నాటక రంగస్థలాలలో ప్రయోగింపబడే సర్వాంగ సుందరమైన నాట్య ప్రబంధమని, ఆచార్య యస్వీ జోగారావు గారు, నాట్య కళ జానపద కళల సంచికలో ఉదహరించారు.