పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంప్రదాయాలనే అనుసరిస్తూ వచ్చారు. అంతేకాకుండా తమిళంలో ఆడబడే నాటకాలూ, పాడబడే పాటలూ అన్నీ తెలుగువే. దీనిని బట్టి ఆంధ్ర తమిళ సాంప్రదాయాలకు మూలం ఒక్కటేనని మనకు బోధపడుతూ వుంది. తమిళులు ఏయే శ్లోకాలను వల్లిస్తున్నారో అదే విధంగా ఆంద్రులూ కూడ వల్లించారు. వారూ వీరూ కూడా కృష్ణకర్ణామృతంలోని శ్లోకాలనే వుపయోగించారు.

కూచిపూడి భాగవతులు క్షేత్రయ్య పదాలను పాడి అభినయించినట్లే, దక్షిణాది కళాకారులు కూడ ఆ సాంప్రదాయాన్నే అనుసరించారు. ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు దక్షిణదేశంలో బహుళ వ్వాప్తిలోకి రావడానికి కారణం కూచిపూడి భాగవతులే నని మనం చెప్పుకోవచ్చు.

అంతే కాకుండా తంజావూరుని పాలించిన అచ్యుతనాయకుడు ఆంధ్ర దేశంనుంచి వలస వెళ్ళిన కళావేత్తలను ఆహ్వానించి ఆదరించిన దానిని బట్టి చూచినా క్షేత్రయ్య పదాల ప్రభావం దక్షిణ దేశంలో పడడం కూడ నిజమైనట్లుగా మన గ్రహించ వచ్చు. అందువల్ల తమిళ భాగవత కర్తలుకూడ ఆనాటి నుంచి ఈ నాటివరకూ వంశ పారంపర్యంగా సాంప్రదాయలనే అనుసరిస్తూ ముందుకు తీసుకు పోతున్నారు.

తమిళదేశంలో భాగవత మేళ నాటకాల్లో ప్రసిద్ధి వహించిన పండనల్లూరు మీనాక్షి సుందరంపిళ్ళై ఇటీవలవరకూ నివసించి ఆ ప్రాంతాల్లో కూచిపూడి భరత నాట్య సాంప్రదాయాలనూ, పదాభినయాన్నీ, విద్యార్థులకు నేర్పాడు.

దీనిని బట్టి ఆంధ్ర తమిళదేశాల్లోని నాట్య సాంప్రదాయాలు ఒక్కటే అని వారి వారి పాటలూ, ఆటలూ నిరూపిస్తున్నాయి. అంతే కాక నాయిక ప్రవేశంలో తనకు తనే చరిత్ర చెప్పుకోవడంలోనూ, విదూషక పాత్రలను ప్రవేశ పెట్టడంలోనూ కూడ ఆంధ్ర సాంప్రదాయాలనే అనుసరిస్తున్నారు.

దక్షిణాదిన విజయనగర చక్రవర్తుల కాలంలో కళలు ఎలా అభివృద్ది పొందాయో అలాగే తంజావూరు, మధుర నాయక రాజుల కాలంలో కూడ సంగీత, సాహిత్య, నాట్య, నాటక విధానాలకు, కవి, పండితులకూ, ఆదరణా, పోషణా లభించాయి.