పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మేలటూరు మేల్బంతి, శూలమంగళం:

మేలటూరు తరువాత వీథినాటకాలను ప్రతిభావంతంగా ప్రదర్శించ గలిగినవారు శూలమంగళ కళాకారులు. వెంకటరామ శాస్త్రి నాటకాలనే కాక, కొరవంజి కళారూపాన్ని, కూడ ప్రజా రంజకంగా ప్రదర్శించారు. వీరు వీథినాటకాల్లో కొన్ని హాస్య పాత్రల్ని కూడ ప్రవేశపెట్టారు. కథకు ఏ సంబంధమూ లేకుండానే ఈ పాత్రలు ప్రవేశిస్తాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నావ్విస్తాయి. ఆలాంటి పాత్రల్లో ఎరుకల సింగి, సింగడు, ఘటనృత్యం చేసేవారు, తురక వేషాలు ధరించే ఫకీరు వేషగాళ్ళు మొదలైన వారు వీరి నాటకం తెలుగులో ప్రదర్శింపబడుతున్నా హాస్య చమత్కారాలు మాత్రం తమిళ భాషలోనే సాగుతాయ.

వూత్తుకూడి వీథినాటకాలు:

ఇక్కడ కూడ వీథి భాగవతాలు ప్రదర్శించేవారున్నారు. ఈ వూరివారు ముఖ్యంగా మేలటూరివారి నాటకాలనే ప్రదర్శించినా, వెంకటరామశాస్త్రి నాటకాలకు ముందు ప్రదర్శించిన నాటకాలు కూడ వున్నాయి. అవి: భామాకలాపం, గొల్ల కలాపం, పార్వతీ పరిణయం, రాథాకృష్ణ విలాసం, మొదలైనవి. అంతేగాక వారు యక్షగానాలైన ప్రహ్లద, గొల్లకలాపం, ఉషా పరిణయం, కూచిపూడి సంప్రాదాయాలనే ప్రదర్శించారు. కూచిపూడి సంప్రదాయమే దక్షిణదేశంలో వూత్తికూడి సంప్రదాయంగా వెలుగొందింది.

వివిధరాజుల ఆదరణలో వీథినాటకాలు:

తంజావూరు రాజుల్లో అచ్యుతప్పనాయకుని మరణానంతరం రాజ్య పరిపాలనకు వచ్చిన రఘునాథరాయల కాలంలో కూడ ఈ భాగవతాలు ఆదరించబడ్డాయి. తరువాత తంజావూరు రాజ్యాన్ని పారిపాలించి, మహారాష్ట్ర ప్రభువుల కాలంలో కూడ ఈ వీథి భాగవతాలు విశేష ప్రశస్తి పొందాయి. అంతేకాక ఆ నాడు దక్షిణ దేశంలో మైసూరు, పుదుక్కోట మొదలుగా గల సంస్థానాలలో కూడ భాగవతాల ప్రభావం పెరిగింది.