పుట:TeluguSasanalu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు లిపి భాషల మొదలు


నాగరికత పెరిగినకొలది మానవుడు తన జీవితమును వైజ్ఞానికముగను, నైతికముగను మెఱుగుపఱచుచు ఆ విధానములను తరతరముల సంరక్షించుట తన కర్తవ్యముగ భావించెను. ఆ ప్రయత్నము లోనిదే లేఖన విద్య భారత దేశము నందీ విద్య యిప్పటికి ఐదువేల సంవత్సరములకు పూర్వము నాటిదనబడు సింధు నాగరికత నాటికే యొక సువ్యక్తమగు రూపము దాల్చియున్నట్లు తెలియుచున్నది కాని యింతవఱకు ఆ లిపి సరిగా చదువబడలేదనియే చెప్పవలెను. తరువాత చెప్పదగిన భారతీయ లిపి క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది నాటిదగు మౌర్యలిపి. అంతకు పూర్వమే వేదములు, వేదాంగములు, ఇంకాయెన్నో సూత్ర గ్రంథములు వెలసియుండుటను బట్టి యేదో విధమగు వ్రాత యుండెడిదని స్పష్టమగుచున్నది. అంతేకాదు, మౌర్యలిపి యనబడు అశోక శాసనములందున్న అక్షరములకన్న వేదసూత్ర వాఙమయమందున్న అక్షర సంపుటి విశిష్టమైన దగుటచే దీనికి చెందిన లిపి అశోక లిపి కంటే విశిష్టమైనదని యెంచవలసి యున్నది. కాని వేద, సూత్ర వాఙమయములందు కానవచ్చు అక్షరములు, వాటి ఉఛ్ఛారణ విశేషములు అన్నియు గురు శిష్య పరంపరగా వల్లేవేయబడుచు సంరక్షించబడినవేగాని వ్రాతతోగూడిన గ్రంథముల ద్వారా కాదని కొందరు చెప్పుదురు. అంతేగాక అశోకుని నాటి లిపి అతిసరళముగను సుగ్రాహ్యముగను ఉండు. ఉదా ; గ = అ, + = క = ర; మొదలగునవి. ఇట్టి ప్రాథమిక దశనుండియే భారతీయ లిపులన్నియు అనేక ప్రాంతీయ మార్పుల నొందుచు నేటి రూపములను పొందినవని లిపి పరిశోధకులు భావించెదరు. ఏది యెట్లున్నను సింధు నాగరికత నాటి లిపిని అశోకుని మౌర్యలిపితో కలుపు రూపాంతరమును తెలుపు ఆధారము లేవియు ప్రస్తుతము లేవు. కనుక మౌర్య లిపియే మన తెలుగక్షరములకు కూడా మాత్రక యయ్యెను.


కుబిరకుని భట్టిప్రోలు శాసనము, ఎఱ్ఱగుడి (జొన్నగిరి) గుట్టమీది అశోకుని శాసనములు ఆంధ్రదేశమునందలి మొదటి వ్రాతలుగ చెప్పబడుచున్నవి. ఆ లిపిని బ్రాహ్మీలిపి యనియు అందలి భాష ఒక విధమగు ప్రాకృతమనియు చరిత్రకారులు చెప్పుదురు. అప్పటినుండి అనేక పరిణామములు