పుట:TellakagitaM.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓ కల జారిపోయింది

ఆకాశం కాన్వాస్ పై
కాలం కుంచె నేల ముంచి జార్చిన చుక్కలా
సుమనోభిరామంగా ఎదిగిన పచ్చదనాల చెట్టుండేది
అది ఓ రాత్రి వేళ కలల్లోంచి జారిపోయింది.

గుండె పగిలిన చప్పుళ్ళు తోటంతా..
పూలూ పళ్లూ చివుర్లూ చెట్టు నాశ్రయించిన పక్షులూ
మొదలు కుదేలైన వేళ్లూ బొట్టు-బొట్టూ రాల్చాయి.

తరలి వచ్చిన గూటి పక్షుల బిక్క చూపులు
నేల వాలి తోట గుండెను చూసేటి తోటి మొక్కలు
తవ్వి తీసినట్టు ఉబికి వచ్చే కన్నీటి చుక్కలు

ఇప్పుడిక కిలకిలలు లేవు మౌన రోదనలు తప్ప
అకాల వానకి కొమ్మారెమ్మా విలవిల లాడాయి.
పట్టపగలు చీకట్లు పరచుకున్నాయి..
ఆకాశం చెమ్మగిల్లింది
నింగిని నేలను కుదిపే ఓ పిడుగుపాటు
ఎప్పుడు రాలిందో ఉల్క చెట్టుని ఎందుకు తాకిందో
బెరడు లాంటి నిబ్బరంతో కాలం ఎలా ఓర్చిందో
నిలబడ్డ నేల నుండి నింగివైపు చూస్తూ
నీడనిచ్చి తోడునిచ్చే పచ్చదనం ఒకనాటి వేడుక
ఇప్పుడది మిగిలింది కన్నీటి జాడగా
జీవితాన్ని కదిలే బొమ్మల్లా అందించే కథ ముగిసింది
వెలుగునీడల తోడుగా ఆడే ఆట కలలా చెదిరింది
అంటుకట్టిన తెలుగు పాట పల్లవంతో ఆగింది
ఆ చెట్టే ఓ చిత్తరువై జ్ఞాపకం
గా మిగిలాక
ప్రతి మొక్కా చెట్టై ఎదగటమే
ఆశయాల అంచులు దాటే పచ్చదనాన్ని
తెలుగు తోటలో పెంపొందించడమే
ఆకాశం ఆశించే హృద్యమైన నివాళి
 (ఈటీవి ఎమ్.డి. సుమన్ గారి స్మృతిలో..)