పుట:TellakagitaM.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చివరి పేజీ

మనస్సాక్షి చెప్పినట్టు పేజీ చివర సంతకం చేసే
 క్షణమొకటి వేచి ఉంటుంది.
పూజానంతరం నైవేద్యం సమర్పించేటందుకైనా
దాయిల్ని చల్లార్చే ఘడియొకటి ఉంటుంది
భక్తి ప్రపత్తుల గాఢత ఎంతున్నా..
పూజ ముగించే పర్వమొకటి ఉంటుంది
అప్పుడు బాధ్యతల నుండి విముక్తి చెందినట్టుగా
జీవితాన్ని ప్రసాదంలా అందించే అవకాశం
తెల్లకాగితపు విస్తరిలో అక్షరాల వడ్దనతో పూర్తవుతుంది
ధ్వజానికి అవతల అంచునే జెండా రెపరెపలాడుతున్నట్టు
  ఏ రచనైనా ప్రారంభం కన్నా ముగింపే బాగుంటుంది
క్రమ క్షీణోపాంత ప్రయోజన సిధ్ధాంతం వర్తించని
ఏమాటైనా మనం పంచుకునే కవితే అవుతుంది
తాడొదిలిన బొంగరంలా నా అక్షరాలు
మీ మనో ఫలకం పై రింగులు తిరుగుతాయి
ఈ పాటికే నచ్చినవి పాలపొంగై ఆలోచనాగ్నికి
స్వాహాయమానమై ఉండిఉంటాయి
అనుభవాల ఆవిరి చాలక అతకని అక్షరాలు కొన్ని
భాష్పోత్సేక మవ్వలేక నీరుగారిపోయుంటాయి.
అయినా పర్వాలేదు.. అక్షరాలు అంతర్ధానమై..
అంతర్యామిగా మారే అనుభూతిని కాగితాన ఇంకిన
ఒక్క ఇంకుచుక్క ఇవ్వగలిగితే చాలు
ఈ సాహిత్యం మీ ఉన్నతిని కోరే సంస్కారమని గుర్తిస్తే చాలు
ఆశ నిరాశల వెలుగునీడల్లో.. చిన్నదైనా పెద్దదైనా
ఎప్పటికీ నిలచిఉండే ఓ తారలా ఉత్సాహంతో ఒక్క మాట పునరుత్పన్నం అయితే చాలు
పేజీలు పూర్తైన తర్వాతైనా కలం నాటిన విత్తులు మొలకెత్తి
సహస్రదళాలతో వెలుగురేఖలను పొదివిపట్టితే చాలు
అక్షరాల మధ్య తెల్లకాగితం తొంగిచూసినప్పుడల్లా
నా ప్రయత్నాన్ని కొనసాగించే మరో యశస్వి
మిణుగురై వెలిగి, మనల్ని; కలల్ని ఎగిరేస్తే చాలు
జీవితాలను ఇగిర్చి ఘుమఘుమలాడిస్తే మేలు
అక్షరజ్యోతుల్ని వెలిగించిన తెల్లకాగితానికి మనసారా
జ్యోతలు అర్పిస్తే .. అదే పదివేలు