పుట:TellakagitaM.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్షరాన్ని.. నేనక్షరాన్ని

అక్షరాన్ని .. నేనక్షరాన్ని ..
శబ్దం నా లక్షణం .. పదే పదే ప్రయోగిస్తే భావం నా లక్ష్యం.
నా లక్షణంతోనే లక్ష్యాన్ని సాధించే మధురక్షణాన్ని.
లక్ష్యం నుండే నా జననం .. లక్ష్యం లోకే నా పయనం ..
అక్షరాన్ని నేనక్షరాన్ని.
విడిగా చూస్తే నా జీవితం అర క్షణం ..
నిఘంటువులలో నా లోతు అహోబిలం
నా పరిధి శత సహస్ర జ్యోతిర్వర్షం.
శబ్దార్థ సర్వస్వమూ నా సాక్షాత్కారం.
అరుణ కిరణపు తీక్షణాన్ని, ధైర్యవంతుల లక్షణాన్ని..
క్షరాన్ని కాదు నేనక్షరాన్ని.. క్షయాన్ని కాదు నేనక్షయాన్ని ..
నా మాతృమూర్తి మాట వెంట నా విలువ అక్షరాలా అక్షర లక్ష .
నా మాతృభూమి పాట వెంట లక్ష అక్షౌహిణీల పై మాటే .
శాఖా గ్రంథాలయాలలో నిక్షిప్తమైన అవక్షేపాన్ని..

నవీన విశ్వవిద్యాలయపు ప్రతి ప్రశాఖలో ..
అలక్ష్యం అవుతున్న అద్భుత నిక్షేపాన్ని.
సాహితీ గవాక్షం నుండి వీక్షిస్తే విరూపాక్షుని విశ్వ రూపాన్ని
 నా పూర్వ ప్రాభవం గత జన్మపు మోక్షం.
పద్యపు పల్లకీ కుదుపులకు సన్నబడిన నుడికారపు నడుమును.
నన్నయ నేర్పిన నడకకు.. తిక్కన తీక్ష్ణ నినాదం తోడైతే ..
పోతన పూసిన తేనె పూతను..
శ్రీనాథుని శృంగార నైషధాన్ని నే నక్షరాన్ని .
విశ్వనాథుని కల్పవృక్షం కింద సేదతీరుతూ..
కృష్ణశాస్త్రి మందారమారుతాల్ని ఆస్వాదించేనాటికి
నాది ప్రౌఢ వయస్సు ..
లుప్త శిల్పంమై జవసత్వాలుడిగిన
నాకు తిలోదకాలిచ్చింది తెలుగు త్రిమూర్తులు ..
వారి అంశతో దత్తాత్రేయుని రూపం వచ్చింది నాకు.