పుట:TellakagitaM.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొన్ని మెరుస్తుంటాయ్

కొన్ని మెరుస్తుంటాయ్
కొన్ని మురిపిస్తుంటాయ్
కొన్ని మాట్లాడిస్తాయ్..
ఆడిస్తాయ్.. పోట్లాడిస్తాయ్
చూపుల్ని లాక్కుని దోచుకునేవి..
పెదాల్ని.. ముక్కుపుటాల్నీ తెరిపించి మనలో దాక్కునేవి
మెలకువలో తారాడేవి.. ధ్యానంలో వెంటాడేవి కొన్నుంటాయ్
బహుశా అన్నీ ఒకేలా పుట్టిఉంటాయ్
ఎందుకిలా అని కారణాలు కొన్నింటికి తట్టీ ఉంటాయ్
కొన్నైనా అందుకోవాలని నడుంకట్టిఉంటాయ్
ఒక్కటై వెలగాలని పట్టుబట్టిఉంటాయ్
అందుకే నలుగురితో జట్టు కట్టి ఉంటాయ్
పుట్టిన ప్రతివాడూ ప్రతీకే పై వాడికి
మనిషి ని కనడానికి కాదు.. మంచిదనం కొలవడానికి
తన మానాన తాను తయారు చెయ్యడానికి
యంత్రం కాదుగా వాడు
అందుకే కుంచె రంగుల్ని చిలకరించినట్టు..
అసలు బొమ్మలే రానట్టు.. వచ్చినా సరిగా దిద్దనట్టూ ..
ఏదో బెట్టు చేసినట్టూ చేస్తుంటాడు.

కొన్ని నవ్వుతున్నట్టూ,
కొన్నిటిపై నవ్వాలి మరి తప్పదని రాసి పెట్టినట్టూ
నవ్విస్తున్నట్టూ కవ్విస్తున్నట్టూ.. చేసి చూపిస్తాడు.
అసలా మాయలోడు ఏం ఆశిస్తాడు!
ఏం ఆశించి మనల్ని ఆడిస్తాడు!!
కొన్ని నవ్వుల్ని రువ్వి కవ్వించి మరీ ఏడిపిస్తాడు
కొందరిని సానపట్టి మెరిపింపజేస్తాడు!
మరికొందరిని తొందరలో ఉన్నట్టు తరిమేస్తాడు
అందరినీ కట్టగట్టినట్టు కనిపిస్తాడు
విడివిడిగా లెక్కగట్టి ఆటలన్ని కట్టిస్తాడు
అందని ఊహల్లో అందర్నీ చుట్టేస్తాడు.
(మనుషుల్లో మాణిక్యం.. అన్నయ్య భాను కిరణ్ ను తలచినపుడల్లా..)