పుట:TellakagitaM.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రేమకు మచ్చ- నీ ఊసు

ఏడుపొస్తుంది సైదుబాబూ!
నీ చావు తెలివితేటలకి.. బతక నేరవా!
బలవంతపు చావులోన నీవలపు బలిపశువా!!
ఆరు సెప్టెంబరు పేపరులో శివకాశీ చావుల హోరు.
రక్షించబోయి ఆర్తుల్ని.. చనిపోయారట పాపం
తెగువచూపి కొందరు.. చావంటే అదిరా…
భగవంతుడి కొలువులోన.. (ఛఛ.. రాలేనివాడి మాటెందుకు!!)
మనుషులనే జాతిలోన.. దయాళువుకే విలువరా.
నిర్దయుడా..! ప్రేమంటే ఏమిటో..
దారులు వేరై విడివడినా.. కలసిమోగే గుండెల సమశ్రుతి నడుగు
ఎదురీతలో తడబడినా బతుకు నావ నడిపించే
విడిజంటలనడుగు ప్రేమంటే ఏమిటో..
చితిమంటల నివురు కింద దేవులాడ.. దొరికిన అస్థిక
చేరినచేతిలో చిందిన.. కన్నీటి గంగ నడుగు
పగతోడుగా నువు చిదిమితే దీపం ఆరిన ఇంటిలో..
నువు గుచ్చిన గునపం..అది చీల్చిన కడుపున సుళ్ళుతిరిగే వేదన; కారుణ్యం నేర్పలేని నీ చదువెందుకు! చావెందుకు!!
నువు చేసిన దారుణానికి ప్రేమకాదు కారణం
ప్రేమిస్తే.. మనసిస్తాం జీవిస్తాం .. మనిషిగా చస్తాం

ప్రేమంటే..
తనకు తానుగా జీవితానికి అర్పించే నివేదన
బతుకు బాటలో పంచుకునే ఆవేదన
మనిషితనాన్ని ప్రోదిచేసే అత్మశోధన
బతికి బతికించుకోవడానికై సాధన
పూసే పువ్వులో, విరిసే నవ్వులో
జీవన సౌందర్యాన్ని దర్శించే ఆరాధన
అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమే కాదు.
ప్రేమించే మనసుంటే..
అలోచనలు అణ్వాయుధాలుగా ఎన్నటికీ మారవు.
ఆమాత్రం తెలుసుంటే..ఇన్ని గుండెలవిసేవి కావు
మాయదారి కసి ముసుగా! ప్రేమకు మచ్చ నీ ఊసు
అది మనుషులపై నమ్మకాన్ని కాల్చే కార్చిచ్చు..
(5.9.12 న ఈనాడు గుంటూరు జిల్లా పత్రిక చదివి.. కన్నీళ్లతో)