పుట:TellakagitaM.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వరదై పారాల్సిందే

ఆఫీసర్ ఉరిమిందానికి చుట్టూ ఉన్న వాళ్ల నవ్వుల మెరపులు గుచ్చుకుని మొహం మంగళం అయ్యింది.
ఆలోచన వడగళ్ల వానలో మంచుముక్కల్లాంటి మెమోల భయం.. కెరీర్-గ్రాఫ్ పై కమ్ముకున్న నిరాశల మేఘమైంది.
జీవితపు జారుడు బల్ల పై
నాకెప్పుడూ ఎదురు దేకుతున్న ప్రయాసే..
తప్పైన ఫైళ్ల చిట్టా లెక్కల చిక్కుముళ్లు
ఏనాటికైనా వీడతాయి కానీ..
నెలవారీ ఖర్చుల తగ్గింపు సూత్రం అంతు చిక్కదు.
అయినా క్రెడిట్ కార్డ్‍ల వాడకంలో నా అహం తగ్గదు.

పెళ్లాం-బిడ్డల కోసమే పురుష లక్షణంలో పదిలంగా ఉన్నానని నేనూ .. ఏక్ నిరంజన్ గాడైతే ఇంతవరకూ ఆగే వాళ్లమా అని బాసూ ..ఆఫీసులోనే మిమ్మల్ని అనవసరంగా తలచుకొంటాం.
పొడారిపోయిన మనసులో ఆవేశపు జడి..
ఎడారో ఎండమావో తేలని మజిలీలో
నిరంతర అలజడి ..
కానీ ఆఫీసు అప్రకటిత వర్షచ్ఛాయా ప్రాంతమే ..
ఇంటికి వచ్చేదారిలో జీవనావసరాలు
కుంగిన భుజాన బరువుల్ని పెంచుతాయి.
కొన్న సరకుల మోత ..
గమ్యం చేరాకా తలుపు తట్టటంలో
వినపడుతుంది.
చేయి లానే గుండె కూడా బరువు దించుకోవాలంటే
ఇంటిపట్టున మనిషి వరదై పారాల్సిందే .

ఆనందమైనా ఆవేశమైనా
కనులింట చెలియలికట్ట దాటాల్సిందే..
(ప్రజాస్వామ్య కుటుంబ వ్యవస్థకు..)