పుట:TellakagitaM.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భావోద్వేగం

ప్రశాంత సాగరం పై ఎగసిపడే అల
నీలాకాశం పై కమ్ముకొచ్చే మేఘమాల
గాలి కెరటాల పోరాటంలో ఆకాశాన్ని కమ్మాలని ..
తీరం తాకే కెరటాన్ని తట్టి లేపితే
కడలి కల్లోలం.. మనకు ప్రమాదం
మిన్ను మన్ను నడుమ
గాలి మీటే ధారాతంత్రుల సంగీతం పుడమికి ప్రమోదం
అలనైనా జడినైనా అలజడి చేసే గాలి
సుఖ దుఃఖాల లోగిలిలో దోబూచులాడుతుంది.
స్పందించే మనసును బంధించి బాధించే కారకం
గాలివాటు కాదు.
భయం, బాధ, కోపం, సంతోషం,
ప్రేమ, ద్వేషం అలవాటుగా రావు.
ఉత్ప్రేరకాల సహచర్యంలో ఎగసిపడేవి మన అనుభూతులే
అందీఅందని ఆత్మానుభవాలే.

నివేదన

దారులు వేరై.. యుగాలు దాటినా.. నిన్ననే కలసినట్టుగా ఉంది.
జ్ఞాపకాల సంధ్యలలోనే నా మనం ఊసులాడుకున్నది..?
చేయి కలిపి నడిచామన్న మాటేగాని..
నా మూలాల మట్టి వేరై.. దిగబడిపోయా..
నువ్ చిటారు కొమ్మల లేచిగుళ్ళను
నిమురుతూ ఉండిపొయావ్ .
ఎండల్లో ఊగిసలాడే నిను చల్లబరచే నీరవ్వాలనే కదా
నే మొదల్లోనే ఇంకిపోయా ..
నువ్ తారపథం లోకి దూసుకుపోయావ్.
రాత్రిళ్లు నిను చూడ వస్తే గాలి కెరటాల సంగీతమై పలుకరిస్తావ్.
మనమిద్దరం వేణువు రంధ్రాల్లా విడివిడి గా ఎందుకుండిపోయాం?
నా ఒంటరితనంలో పాటై వినిపించావే!!
కంటి పాపవై ఎప్పుడు కనిపిస్తావో..!!