పుట:TellakagitaM.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దంలో మనిషిలా నువ్వు నేను, నేను నువ్వు అయ్యేపని
చేయిచాచి ఇవ్వజూపి మనసు కలిపే పని హాయిగొలిపే పని
నువ్వేం చెయ్యగలవో అదే చేయి.. నీ చెయ్యి నాకు ఇచ్చేయ్
పలుకరింత, పలువరింత; వీడుకోలు, వేడుకోలు
అభినందన, అభిశంసన; సమర్ధన, సముధ్ధరణ
సందర్భాలు సవాలక్ష అన్నిటికీ ఒకే లెక్క
చేయి చేయి కలుపు అదే నీ గెలుపు
వేయి మాటలు చెప్పలేనిది చేతి చనువు చెబుతుంది
వందమంది చూపలేనిది చేతి అరలో దాగుంది
పెదవి పెగలనివ్వనిది గుప్పెట గుడిలో ఉంది
కంటి చూపు లేకున్నా శాంతి కాంతి పంచుతుంది
ఎదురెదురు మనసులు మధ్య సందిగ్ధతలు ఎన్నున్నా
స్పర్శతో నిస్త్రాణ నడుం విరిగి, శక్తి మార్పిడి అవుతుంది
తొలకరి చినుకుల వలపులలో ఆమని చిగురించినట్టు
ఏనాడో ఇంకిన జల పైకి ఉబికి వచ్చినట్టు
చేయి చేయి కలపడమంటే ఏకత్వం ఐకమత్యం కావడం
కవళిక చెప్పని కథలన్నీ చేయితాకి చెబుతుంది
ఇచ్చే తీరునిబట్టీ మనిషి జోరును పట్టీ
గట్టిగా ఇస్తే బండోడని వదలకపోతే మొండోడని
వేళ్లను మాత్రం అందిస్తే భద్రతలేమి అని..
 ‘చచ్చిన చేప‘ చేతి స్పర్శకు చేవలేదని
ఇలా పలురకాలు కరచాలనం ఇంద్రధనసు రంగుల్లా
ఆత్మీయ కరచాలనం అన్నింట్లో అదే రాజు
అందుకున్నా పొందినా పొంగిపొరలేది ఆనందం
చేయి పట్టి నొక్కగానే నాలుక సన్నాయిరాగం పలుకుతుంది
స్పర్శ విద్యుత్తై తాకి వెచ్చదనం ఒళ్ళంతా పాకుతుంది

ఎన్నేళ్ళు గడిచినా వేళ్లతడి స్మృతి సంగీతమై మోగుతుంది
తీయటి తలుపుల్లో తనువు తీగల్లె ఊగుతుంది

అందుకునే ఆప్తునికి ఆస్వాదన స్వానుభవం
తడి ఉంటేనే ఈ యోగం ఎవరికైనా సంభవం (మీకే..)