పుట:TellakagitaM.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాణెం గాల్లోకి ఎగురుతుంది

కాలం కలల్ని నాణెంలా ఎగరేస్తే ఆశ.. కిందకి వస్తుందని
ఆర్తితో మనిషి ఆకాశం చూసేది ఓ దైవ స్పర్శని ఆశించి
గురుత్వాకర్షణ తెలీని కుర్రాడు బంతిని ఎగరేసి
దేవుడితో ఆడుతున్నానని అనుకుంటున్నట్టు
ఎగిరి కిందకొచ్చే ప్రతీదీ విధి విలాసం
మనసెంత రువ్వినా ఫలితం శిరోధార్యం
బొమ్మా బొరుసులు.. పొందడం కోల్పోవడాలే
పుట్టుకతో పోయేవి ఊహల్లో కూడా తెలియవు
ఏ స్మృతుల లోతుల్లోంచి బయటకు వస్తామో మనం!!
ఎదిగే కొద్దీ బాల్యం నలుగుతుంది
బడి బరువుల్ని పెంచుతుంది
ఆటే జీవితమయ్యే అంకం నుంచి ..
జీవితమే ఆటయ్యే మజిలీ మొదలౌతుంది.
ఆకుల్లో పాటలు పాఠాలవ్వాల్సింది..
 పాఠాలపుస్తకాలు ఆకుల్లా నలుగుతాయి
మొగ్గల్ని పూవులవ్వనివ్వని మొరటుతనాన్ని నాగరికత నేర్పుతుంది
బొమ్మల స్థానాన్ని వాహనాలు భర్తీ చేసినప్పుడు..
 రోడ్డున పడ్డట్టుంటుంది
బొంగరపు జీవితాలు కొత్తపుంతలెక్కవు..
చేసిందే చేయడం ఇప్పుడో లెక్క
లోటు భర్తీ కార్యక్రమాలు జతకడతాయి..
గోప్యతకు పట్టం కడతారు పిల్లలు
గోడచాటునో సందుచివరో కళ్ళు కలుస్తాయ్
 రాహుకాలం పొంచిచూస్తుంది
ఓ దుర్ముహుర్తంలో
బెదిరింపులో బుజ్జగింపులో లొంగదీస్తాయి
మెత్తని మనసులు మనుషుల్ని కోల్పోతాయి
నాణెం గాల్లోకి ఎగురుతుంది (యుక్త వయస్సు స్పందనలకు..)