పుట:TellakagitaM.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏదో కాంతి నాలో

ఏదో కాంతి నాలో ఊరెళ్తున్నందుకా!!
‘ఎందుకో అంత ఆనందమని’ సహచరి
 మాటల్లో తనని విడిచివెళ్తున్నపుడు.. ఎత్తిపొడిచేటంత
ఏ బంధం మిగిలివుంది అక్కడ అమ్మతప్ప!!
గతం.. ఊరుచేరిన నడకల్లో ..వీధి దీపాల్లా
అనుభూతుల నీడను కుదుపుతోంది అడుగుల్లో
 ఇంటిదారిన చూపు తాకి తేరువ జారిపోతున్నట్టు
పారజూసే పరిచయాలు పలుకరించాలా వద్దా అన్నట్టు
ఈల పాట కై చుట్టిన పెదాలు చుట్టుపక్కలు పట్టించుకోనట్టు
చేరే అడుగుల్లో వయసుని దూరం తగ్గిస్తున్నట్టు
వీధి మలుపు తలపులతో మెలితిరుగుతున్నట్టు
గుమ్మం ఎదురుచూపులో అమ్మకు నా బాల్యాన్ని పంచుతున్నట్టు
ఏ పువ్వైనా తోటలో ఇంత వికసిస్తుందా
మింటివెలుగు నవ్వులతో ఆశీస్సులు కురిపిస్తున్నట్టు.
నా కంటిముందు అదే కాంతి నను మళ్లీ కన్నట్టు కనుగొన్నట్టూ

అమావాస్య రాతిరి

ఉపద్రవం ఘనీభవించిన చీకటి.. ఎప్పటి లాగే ఈ యేడూ
బాంబుల ఆర్భాటాలతో.. జువ్వల చెలగాటాలతో
ఎంతసేపని ఆపగలం పారి ఆరే వెలుగులను
డబ్బుల్ని కాల్చి వెలిగించిన చిచ్చుల్లో
పసి నవ్వులే వెలుగుతాయి
గతించిన నా బాల్యం లీలలు
నిముషాల్లోనే మిగులుతాయి.
ఎంత తమాయించుకున్నా.. నాలో ఆరని శివకాశీ మంటలు
కాలిన బతుకుల నీలినీడల్లో
మందుగుండు ఆర్పిన దీపాలు
ఇవేం పట్టని నేను.. చిన్నారి కంటి వెలుగుల కోసం
మనసూ చేయీ కాల్చుకుంటు.. ఏదైనా కాలితేనే పండగా!
జీవితాన్ని రాలిస్తేనే బతుకు పంట పండేనా?
దీపం వెలిగించి ఉంచితే చాలదా!!