పుట:TellakagitaM.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందమా ! నువ్వెవరు!!

అందం తనమీద రాయమందో కవిత
అంగరాగాలు లేని అమ్మాయి కోసం
ఆరోగ్యమైన జవరాలికోసం, చెలువ పిల్లకోసం
ఎక్కడని వెతకను ఏ కొలతన కొలవను
అద్దాన్ని అడిగా తనే అందమంది
అద్దమే అందమైనప్పుడు అన్నీ అంతేగా
ఉండాలేమో మరి అందరికీ అద్దంలాంటి మనసు
మనల్ని మనలానే చూసుకునే సొగసు
అద్దాలమేడలో ఉన్నది అందమైనదైపోతుందా
అద్దం అందమైతే రాయికెందుకు లోకువ
రాలిపోతే పాలిపోతే పగిలెనే భళ్ళున
ఆడపిల్ల అద్దమూ వద్దు నాకీ పోలిక
రెండూ పెళసరే ఎంచుకుని వేసుకోవాలి పోగిక.
ఏది మంచో లెక్కలేవి ఎందుకొచ్చిన చిక్కులివి
ఊహల్లోని బొమ్మకు పోయలేనా ప్రాణము
పుట్టినప్పుడు పురుడు పోసిన మిస్సమ్మలా
బళ్ళోకెళ్లే బుజ్జోడికి టీచర్ లా
కాలేజీ కుర్రోడికి ముందుబెంచీ అమ్మాయిలా
నాకెప్పుడు కనిపిస్తావో అందమా..
స్నానమయ్యాకా అమ్మ నుదుటి బొట్టులా
పల్లెగట్లమ్మట నీడ పంచే చెట్టులా
కొబ్బరి ముక్క పగలగొట్టి పెట్టే గుడిమెట్టులా
మారుతున్నకాలంలో మళ్లీ నిను చూస్తానో లేదో అందమా!
అందమంటేనే మిస్సైన బంధమా
కలల్లో ననుతాకే భావనా గంధమా
అక్షరాల పలుకరింపులతో ప్రపంచాన్ని పరిచయం చేసే గ్రంథమా!!
అసలు నువ్వెవరు అందమా!!
నను కన్న ఆనందమా.. నే కనుగొన్న స్నేహమా
నాకింకా పుట్టని పసి బంధమా. .. అంతుపట్టని అపురూపమా
అసలు నువ్వెవరు అందమా!!